36 గంటల్లోనే వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ.. నిందితుడి అరెస్ట్

by Jakkula.Mamatha |

హుజూరాబాద్‌ పట్టణంలోని మామిండ్లవాడలో సంచలనం సృష్టించిన చింత సునీత(35) హత్య కేసును పోలీసులు కేవలం 36 గంటల్లోనే ఛేదించారు.

36 గంటల్లోనే వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ.. నిందితుడి అరెస్ట్
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్‌ పట్టణంలోని మామిండ్లవాడలో సంచలనం సృష్టించిన చింత సునీత(35) హత్య కేసును పోలీసులు కేవలం 36 గంటల్లోనే ఛేదించారు. అనుమానంతోనే ఆమె సహజీవన భాగస్వామి మోతే కిరణ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. సోమవారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వాసంశెట్టి మాధవి కేసు వివరాలను వెల్లడించారు.

అనుమానమే ప్రాణం తీసింది..

​ఏసీపీ మాదవి కథనం ప్రకారం.. హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింత సునీత భర్త కుమార్ గతంలోనే మృతి చెందాడు. దీంతో ఆమె గత ఐదేళ్లుగా మోతే కిరణ్ అనే వ్యక్తితో కలిసి మామిండ్లవాడ గ్యాస్ గోదాం సమీపంలోని ఓ అద్దె ఇంట్లో సహజీవనం చేస్తోంది. అయితే, సునీత తన పొరుగున ఉండే ముతోజు భాగ్య అనే మహిళతో స్నేహంగా ఉంటూ తరచూ బయటకు వెళ్లేది. దీనిపై సునీత ప్రవర్తనను కిరణ్ తప్పుగా అనుమానించడంతో ఇద్దరి మధ్య కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి.

మద్యం మత్తులో ఘాతుకం.. బావిలో మృతదేహం..

​ఈ నెల 10వ తేదీన కిరణ్, సునీత ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో మళ్లీ అదే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన కిరణ్.. సునీత గొంతు నులిమి, ఆపై చీర ముక్కతో గొంతు బిగించి, కాలితో మెడపై తొక్కి దారుణంగా హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని మోసుకెళ్లి సునీత స్నేహితురాలైన భాగ్య ఇంటి సమీపంలోని ఓ బావిలో పడేశాడు. అనంతరం ఆమె లో దుస్తులను బావి సమీపంలోని చెట్టు వద్ద పడేసి, అక్కడి నుంచి కరీంనగర్‌కు పరారయ్యాడు.

పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు..

​ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం (ఈ నెల 13న) నిందితుడు కిరణ్ తిరిగి హుజూరాబాద్‌కు వచ్చినట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ​పోలీసుల విచారణలో నిందితుడు కిరణ్ తన నేరాన్ని స్వచ్ఛందంగా అంగీకరించాడు. ​అతడు ఇచ్చిన సమాచారం మేరకు హత్య జరిగిన ఇల్లు, మృతదేహాన్ని పడేసిన బావి, దుస్తులు పడేసిన స్థలాలను పోలీసులు పరిశీలించారు. సంఘటనా స్థలం నుంచి పగిలిన గాజులు, పుస్తెల పూసలు, కాలి పట్టీలు వంటి కీలక ఆధారాలతో పాటు బావి సమీపంలో పడేసిన మృతురాలి లో దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.

​పోలీసు సిబ్బందికి ఏసీపీ అభినందనలు..

​నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ మాధవి తెలిపారు. అతి తక్కువ సమయంలో(36 గంటల్లోనే) కేసును ఛేదించి నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిఐ కరుణాకర్, ఎస్ఐలు రవి, శ్రీనివాసరావు, సిబ్బంది మోహన్, అవినాష్, మహేందర్, శ్రీధర్, అనిల్ లను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story