ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ.. వైరల్‌గా మారిన పోస్ట్

by Mallepaka Hamsa |

ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న రాజకీయ ఊహాగానాలతో ఈ 'మా ఊరు వాడ' కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేసింది.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ.. వైరల్‌గా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రాబోతున్నారని గత కొద్ది రోజులుగా పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా జూలై 18న తారక్ కీలక ప్రకటన విడుదల చేయనున్నారని.. అభిమాన సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అధికారిక బృందం స్పందిస్తూ ఒక నోట్ విడుదల చేసింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెబుతూ ఆ పుకార్లకు పూర్తిగా చెక్ పెట్టింది. జూలై 18న ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన ఉంటుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు తమ దృష్టికి వచ్చాయని తారక్ టీమ్ పేర్కొంది. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని వారు స్పష్టం చేశారు. జూలై 18వ తేదీన నిర్వహించాలనుకున్న 'మా ఊరు వాడ' కార్యక్రమం ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించుకున్నదేనని వారు వివరించారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఆ సంస్థ లేదా ప్రాజెక్ట్ ప్రధాన ఆలోచన, లక్ష్య, విజన్‌ను ప్రజలకు పరిచయం చేయడానికి మాత్రమే ఉద్దేశించబడిందని తెలిపారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న రాజకీయ ఊహాగానాలతో ఈ 'మా ఊరు వాడ' కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేసింది. మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా పేజీలు దయచేసి ఇలాంటి నిర్ధారణ కాని లేదా అసత్య సమాచారాన్ని ప్రచారం చేయవద్దని వారు విజ్ఞప్తి చేశారు. వార్తలను ప్రచురించే ముందు లేదా పంచుకునే ముందు వాస్తవాలను ఒకసారి నిర్ధారించుకోవాలని కోరారు. దీనివల్ల అభిమానుల్లో అనవసరమైన అయోమయం ఏర్పడకుండా నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం వంటి పూర్తి వివరాలను త్వరలోనే తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటిస్తామని తారక్ బృందం వెల్లడించింది. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, నిరంతర సహకారానికి వారు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో గత కొద్ది కాలంగా వైరల్ అవుతున్న పుకార్లకు చెక్ పడినట్లు అయింది.

Next Story