హనుమాన్ మాల ధరించిన ముస్లిం యువకుడు యూసఫ్

by Malleboina Mahesh |   (  Updated:2026-04-02 09:38:07  IST  )

మతసామరస్యానికి ప్రతీకగా జగిత్యాల జిల్లాకు చెందిన మహమ్మద్ యూసఫ్ అనే ముస్లిం యువకుడు హనుమాన్ దీక్ష చేపట్టారు.

హనుమాన్ మాల ధరించిన ముస్లిం యువకుడు యూసఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నేడు ప్రజలు హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లో మతసామరస్యానికి నిలువెత్తు ఉదాహరణగా ముస్లిం యువకుడు నిలిచాడు. పూడూరు గ్రామానికి చెందిన మహమ్మద్ యూసఫ్ అనే ముస్లిం యువకుడు హనుమాన్ మాల ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. మతాలు వేరైనా దైవం ఒక్కటేనని చాటి చెబుతూ ఆయన 11 రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో హనుమాన్ దీక్షను కొనసాగించారు. ఈ రోజు హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకుని, స్వామి వారిని దర్శించుకుని తన మాలను విరమించారు.

దీక్ష వెనుక ఉన్న విశ్వాసం..

గత ఏడాది యూసఫ్ ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తాను ప్రాణాలతో ఉన్నానంటే అది శ్రీరామచంద్రుని కృప, హనుమంతుడి ఆశీస్సులేనని యూసఫ్ బలంగా విశ్వసించారు. ఆ భక్తితోనే ఈ ఏడాది హనుమాన్ మాల ధరించాలని నిర్ణయించుకున్నారు. "అన్ని మతాలు సమానమే, దైవ ప్రార్థనలో భేదాలు ఉండకూడదు" అని సందేశం ఇస్తూ ఆయన చేసిన ఈ పనిని స్థానికులు మరియు భక్తులు ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నారు. యూసఫ్ మాలధారణ సమాజంలో సామరస్యానికి ఒక కొత్త స్ఫూర్తిని నింపింది.

Next Story