- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మర్డర్ కేసు ఛేదన.. నలుగురు నిందితుల అరెస్ట్
ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసును గోల్కొండ పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

దిశ, కార్వాన్ : ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసును గోల్కొండ పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫయాజ్ సోమవారం వివరాలను వెల్లడించారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మర్ వాడికి చెందిన ఎలక్ట్రీషియన్ షేక్ మహబూబ్ అలియాస్ మసూద్ చండి (26) యూ ట్యూబర్ కి, అదే ప్రాంతానికి చెందిన రుక్సార్ బేగంతో గత సంవత్సరం జనవరిలో ప్రేమ వివాహం జరిగింది. అయితే ఈ వివాహం రుక్సార్ సోదరుడైన షేక్ జాహెద్ అలియాస్ సోహైల్‌కు అస్సలు ఇష్టం లేదు. ఈ క్రమంలోనే మసూద్ చండి పై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్న సోహైల్, తరచుగా గొడవలకు దిగేవాడు. గత సంవత్సరం డిసెంబర్‌లో ఈ దంపతులకు మగబిడ్డ జన్మించినప్పటికీ సోహైల్ కక్ష వీడలేదు. ఇటీవల సోహైల్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సోదరి రుక్సార్‌ను బలవంతంగా పుట్టింటికి తీసుకెళ్లిపోవడమే కాకుండా విడాకులు ఇప్పిస్తానని బెదిరించాడు.
ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం సుమారు 3:00 గంటల ప్రాంతంలో నిందితుడు సోహైల్ తన కజిన్ సోదరులైన జీషన్ నవాబ్ అలియాస్ జాబర్ (30) మిల్క్ డెలివరీ బాయ్, అమీర్ నవాబ్ అలియాస్ లడ్డు (26) టైల్స్ వర్కర్, నఫీజ్ సుల్తానా (48)క్యాటరర్ తో కలిసి ఇనుప రాడ్లు, కత్తులు, కర్రలతో మసూద్ చండి ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వినకుండా సోహైల్ ఇనుప రాడ్‌తో జీషన్ నవాబ్ కత్తితో మసూద్ తల పై, శరీర భాగాల పై దారుణంగా దాడి చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులు కర్రలతో చితకబాదారు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై మసూద్ చండి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అడ్డువచ్చిన మసూద్ తండ్రి షేక్ ఇస్మాయిల్ పై కూడా దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి తండ్రి షేక్ ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి గోల్కొండ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంజయ్య ప్రత్యేక బృందాలతో నిందితులను అదుపులోకి తీసుకుని ఒక ఇనుప రాడ్, ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.






