​పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్

by Jakkula.Mamatha |

హుజూరాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని, ప్రజారోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని స్పష్టం చేశారు.

​పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్
X

దిశ,​హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని, ప్రజారోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని స్పష్టం చేశారు. గురువారం ఉదయం 5 గంటలకే ఆమె పట్టణంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ​ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ వార్డుల్లో జరుగుతున్న చెత్త సేకరణ, డ్రైనేజీల పూడికతీత పనులను ఆమె స్వయంగా పరిశీలించారు. అనంతరం పారిశుధ్య సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి, కార్మికుల హాజరును స్వయంగా నమోదు చేసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని, కేటాయించిన సమయానికి పనుల్లో పాల్గొని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

​కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ..

​ఈ తనిఖీలో భాగంగా పారిశుధ్య కార్మికులతో ముఖాముఖి మాట్లాడిన చైర్‌పర్సన్, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రక్షణ పరికరాలు, వేతనాలు, ఇతర సదుపాయాల గురించి ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పారిశుధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమైనదని కొనియాడారు. కార్మికులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని, మున్సిపాలిటీ తరఫున ఎల్లప్పుడూ వారికి పూర్తి అండగా ఉంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డు ఇన్‌స్పెక్టర్లు, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story