- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబైలో మరోసారి మత కల్లోలం!.. ఆజ్యం పోసిన హిందూ సంఘాలు
ముంబైలో మరోసారి మతకల్లోలాలతో రావణ కాష్ఠంగా మారనుంది.

దిశ, వెబ్ డెస్క్ : ముంబైలో మరోసారి మతకల్లోలాలతో రావణ కాష్ఠంగా మారనుంది. హిందూ-ముస్లింల మధ్య గొడవలు చెలరేగడంతో నగరంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే నగర శివార్లలోని మీరా రోడ్‌లో ఉన్న పూనమ్ క్లస్టర్ పరిధిలోని శ్రీష్టి కాంప్లెక్స్‌లో బక్రీద్ (ఈద్-ఉల్-అజా) పండుగ సందర్భంగా రెండు వర్గాల మధ్య తీవ్రమైన మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కాంప్లెక్స్ ప్రాంగణంలోకి కొంతమంది ముస్లిం కుటుంబాలు బక్రీద్ పండగ కోసం మేకలను తీసుకురావడంతో పాటు, వాటిని ఉంచేందుకు అక్కడ తాత్కాలికంగా ఒక షెడ్‌ను నిర్మించడంతో ఈ వివాదం మొదలైంది. అయితే నివాస ప్రాంతాలలో ఇలా జంతువులను ఉంచడం హౌసింగ్ సొసైటీ నిబంధనలకు విరుద్ధమని, దీనివల్ల పరిశుభ్రత లోపిస్తుందంటూ స్థానిక హిందూ నివాసితులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మొదలైన సాధారణ వాగ్వాదం కాస్తా పెరిగి పెద్దదై, చివరికి రెండు వర్గాల మధ్య పరస్పర దాడులు, కొట్లాటకు దారితీసింది.
ఈ గొడవ గురించి సమాచారం అందడంతో విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ వంటి హిందూ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసనలకు దిగారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ, ముస్లిం వర్గానికి ప్రతిచర్యగా కొందరు హిందూ కార్యకర్తలు సొసైటీ ప్రాంగణంలోకి పందిని తీసుకువచ్చి నిరసన తెలిపినట్లు సమాచారం. విషయం తీవ్రరూపం దాల్చడంతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు వివాదానికి కారణమైన ఆ తాత్కాలిక షెడ్‌ను వెంటనే కూల్చివేసి, మేకలను బక్రీద్ నిబంధనల ప్రకారం నిర్దేశించిన అధికారిక ప్రాంతాలకు తరలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన ముంబైలో మరోసారి సామాజిక ఉద్రిక్తతలను పెంచగా, ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసిన పోలీసులు.. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.






