బార్పేటా రోడ్‌లో సినిమా తరహా దోపిడీ..12 కోట్ల విలువైన నగలు మాయం

by Malleboina Mahesh |

అస్సాంలో సాహసోపేత దోపిడీ! సెన్కో జ్యువెలరీలో రూ. 12 కోట్ల నగలు మాయం. సిబ్బందిని బంధించి సినిమా ఫక్కీలో దోపిడీ. నలుగురు నిందితుల అరెస్ట్.

బార్పేటా రోడ్‌లో సినిమా తరహా దోపిడీ..12 కోట్ల విలువైన నగలు మాయం
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న దొంగతనాలు సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా పోలీసులతో పాటు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పట్టపగలే అత్యంత సాహసోపేతంగా దోపిడీ జరిగింది. అస్సాంలోని బార్పేటా రోడ్ పట్టణంలో దుర్గాబారి రోడ్‌లోని 'సెన్కో అలంకార్' జ్యువెలరీ షోరూమ్‌లోకి కస్టమర్ల ముసుగులో ప్రవేశించిన ఐదుగురు దుండగులు, తుపాకులతో సిబ్బందిని హడలెత్తించారు. ఐదుగురు మహిళా ఉద్యోగులతో సహా ఎనిమిది మంది సిబ్బంది చేతులు, కాళ్లు కట్టేసి, నోళ్లకు టేపులు వేసి ఒక గదిలో బంధించారు.

సినిమా సీన్లను తలపించేలా సాగిన ఈ దోపిడీలో దుండగులు సాక్ష్యాలు దొరకకుండా సీసీటీవీ హార్డ్ డిస్క్‌లను కూడా ఎత్తుకెళ్లారు. మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో దుండగులు జ్యువెలరీ సిబ్బందిని బందించడం స్పష్టంగా కనిపించింది.

ఈ దోపిడీలో సుమారు 12 కోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు, నగదును దోచుకెళ్లినట్లు షోరూమ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేవలం అరగంట వ్యవధిలోనే పని ముగించుకున్న దుండగులు, వెళ్లేటప్పుడు షోరూమ్ షట్టర్లను బయట నుంచి లాక్ చేసి పరారయ్యారు. స్థానిక వ్యాపారస్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఇంత పెద్ద దోపిడీ జరగడం స్థానికంగా కలకలం రేపింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. గోల్పారా జిల్లాలో జరిపిన ఆపరేషన్‌లో నలుగురు అనుమానితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు సమాచారం. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దోచుకున్న ఆభరణాలను రికవరీ చేసేందుకు దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలుస్తుంది.

Next Story