సంచలనం రేపుతోన్న పబ్ వ్యవహారం.. సినీ నటి హేమ హల్‌చల్

by Disha Web Desk 2 |
సంచలనం రేపుతోన్న పబ్ వ్యవహారం.. సినీ నటి హేమ హల్‌చల్
X

దిశ, బంజారాహిల్స్: బంజారాహిల్స్ ర్యాడిసన్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేపుతోంది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పోలీస్ ఉన్నతాధికారులు బంజారాహిల్స్ సీఐ శివచంద్రను సస్పెండ్ చేశారు. ఏసీపీ సుదర్శన్‌‌కు చార్జ్‌మెమో జారీ చేశారు. గత కొంతకాలంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పబ్‌లలో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం ఉన్నా, లైట్ తీసుకొని చూసీచూడనట్లు వదిలేశారని పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో పుడింగ్ పబ్‌‌లో విచ్చల విడిగా డ్రగ్స్‌తో పాటు కొకైన్ తీసుకుంటున్నట్లు పక్కా సమాచారం రావడంతో మఫ్టీలో వెళ్లి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పబ్‌పై దాడి చేశారు. పోలీసులను గమనించిన నిందితులు, నిర్వాహకులు ఎక్కడికక్కడే డ్రగ్స్ ప్యాకెట్లను పడేసి పరారయ్యారు. పోలీసుల దాడిలో సుమారు 150 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో 39 మంది యువతులు ఉన్నారు. వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ సినీ నటుడి కుమార్తె, ఏపీకి చెందిన ఎంపీ కుమారుడు, మాజీ డీజీపీ కుమార్తె సహా పలువురు ఉన్నారు.

పోలీసు శాఖలో కలకలం

బంజారాహిల్స్ ర్యాడిసన్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సీఐని బాధ్యున్ని చేస్తూ సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో పెద్దల హస్తం ఉందని, కేవలం సీఐని మాత్రమే బలిపశువును చేస్తూ.. ఉన్నతాధికారులు తప్పించడంపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో వెస్ట్ జోన్ డీసీపీ, ఏసీపీకి సమాచారం ఉన్నా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా.. గతంలో జూబ్లీహిల్స్‌లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కార్ ప్రమాదం కేసులో వెస్ట్ జోన్ డీసీపీ, జోయల్ డెవీస్, ఏసీపీ సుదర్శన్ చక్రం తిప్పినట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సినీ నటి హేమ హల్‌చల్

కాగా, బంజారాహిల్స్ పోలీస్ స్టేష్లన్‌లో సినీ నటి హేమ హల్‌చల్ చేశారు. తనకు సంబంధం లేని డ్రగ్స్ కేసులో తాను ఉన్నట్లు పుకార్లు సృష్టించి, తన ప్రతిష్ట దిగజారేలా మీడియాలో కథనాలు రావడంపై మీడియాపై ఆమె చిందులు వేశారు. నేను పబ్‌లో లేకపోయినా.. నా పేరు ఎందుకు బయటకు తెచ్చారంటూ సూటిగా నిలదీశారు.


Next Story

Most Viewed