నో ఎన్‌వోసీ.. నో కన్వర్షన్..! అయినా ఆగని సెల్ టవర్ నిర్మాణం

by Disha Web Desk 1 |
నో ఎన్‌వోసీ.. నో కన్వర్షన్..! అయినా ఆగని సెల్ టవర్ నిర్మాణం
X

దిశ, వైరా: వైరా పట్టణ పరధిలోని తల్లాడ రోడ్డులో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణ పనులు చకచకా జరుగుతూనే ఉన్నాయి. మున్సిపాలిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా, సెల్ టవర్ నిర్మించే స్థలానికి కమర్షియల్ కన్వర్షన్ చేయకుండా నిర్వాహకులు పనులు చేపడుతున్నారు. తమ ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మించొద్దని ఆ ప్రాంత ప్రజలు మున్సిపాలిటీ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సెల్ టవర్ నిర్మాణ పనులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఎన్ఓసీ, ల్యాండ్ కన్వర్షన్ లేకుండా.. సెల్ టవర్ నిర్మాణ పనులు చేపడుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు.

కనీస అనుమతులు లేకుండా ఇప్పటికే సుమారు 15 అడుగుల లోతు గుంతలు తీసి పెద్ద పెద్ద పిల్లర్లు నిర్మించేందుకు ఇనుప రాడ్లతో బుట్టలు కూడా కట్టేశారు. ఐదు రోజుల క్రితం మున్సిపాలిటీ అధికారులకు ఆ ప్రాంత ప్రజలు ఫిర్యాదు చేసినా ఇటువైపు కన్నెతి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ ప్రాంత ప్రజల ఫిర్యాదుతో 8వ వార్డు కౌన్సిలర్ కన్నెగంటి సునీత కూడా సెల్ టవర్ నిర్మాణంపై అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ, అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. ఒకవేళ సెల్ టవర్ నిర్మిస్తే తాము రేడియేషన్ కారణంగా అనారోగ్యాల బారిన పడతామని ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విషయమై వైరా మున్సిపాలిటీ కమిషనర్ సీహెచ్ వేణును ‘దిశ’ వివరణ కోరగా.. సెల్ టవర్ నిర్మాణంపై అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు వచ్చిన విషయం వాస్తవమే అని తెలిపారు. సోమవారం ఆ పనులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ జిల్లా అధికారులు స్పందించి అనుమతులు లేకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ నిర్మిస్తున్న సెల్ టవర్ పనులను నిలిపేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed