శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం

by Muthe.Rajitha |

శాసనమండలిలో మంగళవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది.

శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: శాసనమండలి సమావేశాలు మంగళవారం చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌, బిజెపి సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బి.మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చర్చను ప్రారంభించారు. సభలో డ్రగ్స్‌ అంశం తీవ్ర దుమారం రేపింది. మాజీ సిఎం కెసిఆర్‌ పేరును ప్రస్తావిస్తూ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించొద్దంటూ సూచించడంతో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయితే డ్రగ్స్‌ పరీక్షలకు సిఎం రేవంత్‌ రెడ్డి సిద్ధంగా ఉన్నారని, కెటిఆర్‌ కూడా ముందుకు రావాలని మహేశ్‌ గౌడ్‌ సవాల్‌ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు డ్రగ్స్ టెస్ట్ కు సిద్దంగా ఉండాలని, తాము కూడా డ్రగ్స్ టెస్ట్ కు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. డ్రగ్స్ అనగానే మీ నాయకుడి పేరు ఎందుకు వస్తుందని బీఆర్ఎస్ సభ్యులను మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. గోదావరి జలాలను వినియోగంలోకి తెచ్చేందుకు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ లు అద్దంకి దయాకర్‌, బల్మూర్ మెట్ లు ప్రభుత్వ పురోగతిని వివరించారు. రూ. 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో పూర్తి చేశామని, సన్న వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ అందిస్తున్నామని వారు తెలిపారు. రైతు భరోసా కింద ఇప్పటికే రూ. 19 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ బలోపేతానికి రూ. 1000 కోట్లు కేటాయించామని, ప్రతి నియోజకవర్గంలో సమీకృత గురుకులాల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, వరంగల్‌, ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుల పునరుద్ధరణతో పాటు బాసర నుండి భద్రాచలం వరకు టెంపుల్‌ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 5 గ్యారంటీలు అమలు చేస్తున్నా ప్రతిపక్షాలకు కనిపించకపోవడం విచారకరమన్నారు. బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సి. మధుసూదనాచారి, బిజెపి సభ్యులు ఎ.వి.ఎన్‌. రెడ్డి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న రూ. 2500 నగదు ఎందుకు ఇవ్వడం లేదని, ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైందని మధుసూదనాచారి ప్రశ్నించారు.

విత్తనాలు, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని, దీనిపై స్పష్టమైన విధానం ఉండాలని బిజెపి సభ్యులు ఎ.వి.ఎన్‌. రెడ్డి డిమాండ్‌ చేశారు. పెన్షన్‌ బకాయిల విడుదల, డిఎస్‌సి ప్రక్రియ వేగవంతం, జాతీయ విద్యా విధానం-2020 అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీపీఐ ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని భావించిందని, కానీ ఈ ప్రభుత్వమైన నల్లమల జిల్లాలకు నీరందించాలని కోరుతున్నట్లు తెలిపారు.


Next Story