తల్లి రాసిన మరణశాసనం.. కారణం ఇదేనా?

by Muthe.Rajitha |

చర్లపల్లి రైల్వేట్రాక్‌పై తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది.

తల్లి రాసిన మరణశాసనం.. కారణం ఇదేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : చర్లపల్లి రైల్వేట్రాక్‌పై తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. శనివారం తెల్లవారుజామున గూడ్స్‌ రైలు కింద పడి ముగ్గురు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఘటనపై సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయరెడ్డి సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపినట్టు సమాచారం. తల్లి ఇలాంటి ఘోర నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఒంటరితనమే కావచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం విజయరెడ్డి హాస్టళ్లలో ఉన్న పిల్లలను తీసుకొచ్చి, సొంత కారులో చర్లపల్లి రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌లో వాహనం నిలిపారు. పార్కింగ్‌ స్లిప్‌ వెనుక వైపున "తనకు జీవించాలని లేదని, తాను లేకపోతే పిల్లలు ఒంటరవుతారని" సూసైడ్‌ నోట్‌ రాసి కారులో వదిలేశారు. అదే లేఖను ఫొటో తీసి తన వాట్సప్‌ స్టేటస్‌గా కూడా పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం పిల్లలతో కలిసి రైల్వేట్రాక్‌పైకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించగా.. ఆదివారం సాయంత్రం బీబీనగర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

విజయరెడ్డి–సురేందర్‌రెడ్డిల వివాహం 2007లో జరిగింది. నాలుగేళ్ల క్రితం సురేందర్‌రెడ్డికి దుబాయ్‌లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లారు. విజయరెడ్డి హైదరాబాద్‌లో ఉప్పల్‌ డిపో రాఘవేంద్రనగర్‌లో తల్లి పుష్పలతతో కలిసి పిల్లలతో ఉంటూ ఐటీ కంపెనీలో టీమ్‌ లీడర్‌గా పనిచేస్తున్నారు. రాత్రి షిఫ్టులు ఉండటంతో పిల్లలను హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. భర్త దూరంగా ఉండటం, జాబ్ ప్రెషర్స్, కుటుంబ బాధ్యతలన్నీ ఒంటరిగా మోయడం వల్ల ఒంటరితనంతో కుంగిపోయిందని.. ఇటీవల ఈ విషయాన్ని బంధువులు, స్నేహితుల దగ్గర చెప్పుకొని బాధపడినట్టు సమాచారం. మెల్లిగా సర్దుకుంటుందని తాము అనుకున్నామని, ఇలాంటి మరణశాసనం రాసుకుంటుందని ఊహించలేకపోయామని వారు అంత్యక్రియల్లో కన్నీరు పెట్టుకున్నారు.

అయితే ఈ ఘటనపై పోలీసులు విజయరెడ్డి మొబైల్‌లోని చివరి కాల్స్‌, చాటింగ్‌ వివరాల్లో ఉన్న ఆమె ఇద్దరి టీమ్ మెంబర్స్ ను విచారించారు. అయితే అవి వర్క్ రిలేటెడ్ మెసేజెస్ అని తేలినట్టు పోలీసులు తెలిపారు. కుటుంబంలో ఏమైనా విభేదాలు, ఆస్తి తగాదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాద ఘటనపై ఆదివారం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. మహిళల ఒంటరితనం, మానసిక ఒత్తిళ్లపై చర్చించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story