చీరపై ఉన్న ప్రేమ కొడుకుపై లేదా.. తల్లి చేసిన పనికి నెటిజన్లు షాక్!

by Malleboina Mahesh |

చీర కోసం కొడుకు ప్రాణాలతో చెలగాటం! నాలుగో అంతస్తు నుండి బాలుడిని వేలాడదీసిన తల్లి. షాకింగ్ వీడియో చూసి నెటిజన్లు ఆగ్రహం."

చీరపై ఉన్న ప్రేమ కొడుకుపై లేదా.. తల్లి చేసిన పనికి నెటిజన్లు షాక్!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ సమాజంలో ఏ తల్లి అయినా సాధారణంగా తన బిడ్డ ప్రాణాల కోసం తన ప్రాణాలనైనా పణంగా పెడుతుంది. కానీ ఓ తల్లి మాత్రం తాను కట్టుకునే చీర కోసం కొడుకు ప్రాణాలు పణంగా పెట్టింది. వివరాల్లోకి వెళితే..మూడో అంతస్తు బాల్కానీలో పడిన తన చీరను తీసుకురావడం కోసం ఒక తల్లి తన కొడుకు ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. నాలుగో అంతస్తులో నివసించే ఆమె, కేవలం ఒక చీర కోసం ఇంతటి భయంకరమైన సాహసానికి ఒడిగట్టడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చీరతో కట్టి.. కిందకు వేలాడదీసి!

వైరల్ గా మారిన వీడియోలో ఈ ప్రమాదకరమైన ప్రయోగానికి సంబంధించిన దృష్యాలు స్పష్టంగా కనిపించాయి. అందులో ఆ తల్లి మరో చీరనే సాధనంగా వాడుకుంది. తన కొడుకు నడుముకు ఒక చీరను గట్టిగా కట్టి, నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి మూడో అంతస్తుకు వేలాడదీసింది. ఆ బాలుడు గాలిలో వేలాడుతూ కింది బాల్కనీలోకి వెళ్లి చీరను అందుకున్నాడు. ఆ తర్వాత ఆ తల్లి మళ్లీ ఆ బాలుడిని పైకి లాగేసింది. ఏమాత్రం పట్టు తప్పినా, చీర ఊడిపోయినా ఆ బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవే. ఈ దృశ్యాన్ని చూస్తున్నంత సేపు స్థానికులు గుండెలు అరచేతిలో పెట్టుకున్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ తల్లిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. "చీర పోతే మరొకటి కొనుక్కోవచ్చు కానీ, బిడ్డ ప్రాణం పోతే తిరిగి వస్తుందా?" అని ప్రశ్నిస్తున్నారు. చీరపై ఉన్న మక్కువ కన్నబిడ్డ పై లేకపోవడం అత్యంత విచారకరమని, ఇది కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు, నేరమని నెటిజన్లు మండిపడుతున్నారు. తల్లిగా బాధ్యతను మర్చిపోయి బిడ్డను ప్రాణాపాయంలోకి నెట్టిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Next Story