మొరం మాఫియా బరితెగింపు.. ప్రభుత్వ ట్రాక్టర్లలోనే అక్రమ రవాణా

by Malleboina Mahesh |

ఉండవెల్లి మండలంలో మొరం మాఫియా బరితెగించింది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లనే అక్రమ రవాణాకు వాడుతూ ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ దందా బహిరంగంగా సాగుతోంది.

మొరం మాఫియా బరితెగింపు.. ప్రభుత్వ ట్రాక్టర్లలోనే అక్రమ రవాణా
X

దిశ, అలంపూర్: గ్రామాల అభివృద్ధికి వినియోగించాల్సిన ప్రభుత్వ ట్రాక్టర్లే ఇప్పుడు అక్రమ మొరం దందాకు అడ్డాగా మారాయి. రహదారి పనుల పేరుతో శ్రీశైలం ముంపు భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ, గ్రామ పంచాయతీ వాహనాలతో పగలు-రాత్రి తేడా లేకుండా మట్టి తరలిస్తున్న ఘటన ఉండవెల్లి మండలం శేరుపల్లి గ్రామ పరిధిలో కలకలం రేపుతోంది. అధికార యంత్రాంగం మౌనంగా ఉండటంతో ఈ దందా వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆదివారం సెలవు దినాన్ని అదనుగా చేసుకున్న ప్రభుత్వ వాహనాల్లోనే మొరంను అక్రమంగా తరలించడం చర్చనీయాంశంగా మారింది.

ముంపు భూములే లక్ష్యం..

మండల కేంద్రంలో జరుగుతున్న రహదారి నిర్మాణ పనుల సాకుతో కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని శ్రీశైలం ముంపు భూములను అక్రమార్కులు లక్ష్యంగా చేసుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఇక్కడ భారీగా తవ్వకాలు చేపట్టి మొరం తరలిస్తున్నారు. ముఖ్యంగా మారమునగాల-1, మారమునగాల-2, కంచుపాడు, ఉండవెల్లి వంటి గ్రామాలకు చెందిన పంచాయతీ ట్రాక్టర్లను ఈ అక్రమ రవాణాకు పడుతుండటం గమనార్హం. పారిశుధ్య పనులకు వాడాల్సిన వాహనాలు ఇలా అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తుంటే అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారుల మౌనం.. లోపాయికారి ఒప్పందమా?

పగలు, రాత్రి తేడా లేకుండా యంత్రాలతో మట్టి తవ్వకాలు జరుగుతున్నా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం కనీసం అటువైపు చూడకపోవడం వెనుక పెద్ద కథే ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల స్థాయి అధికారులతో అక్రమార్కులు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారని, అందుకే ఈ దందా సాఫీగా సాగుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత లాభాల కోసం వాడుతుంటే వ్యవస్థలు ఎందుకు మూగబోయాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, శేరుపల్లి పరిధిలో జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Next Story