ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని మోడీ.. ఆ కూటమికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

by Muthe.Rajitha |   (  Updated:2026-02-25 15:42:44  IST  )

ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహం ఇదేనా?

ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని మోడీ.. ఆ కూటమికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
X

దిశ, వెబ్ డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లారు. కాగా మోడీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పర్యటన సాధారణ ద్వైపాక్షిక సందర్శనగా కాకుండా, భారత విదేశాంగ వ్యూహంలో కీలక మలుపుగా అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ టూర్ వెనుక ప్రధాన కారణాలు.. రక్షణ సహకారం, ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం, ఆధునిక సాంకేతిక రంగాల్లో (ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సు – AI, క్వాంటమ్ కంప్యూటింగ్) భాగస్వామ్యం పెంపు, అలాగే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పెరుగుతున్న ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యూహాత్మక మైత్రిని బలోపేతం చేయడం అని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ(Benjamin Netanyahu)తో జరిగే చర్చల్లో ఈ అంశాలన్నీ ప్రాధాన్యంగా ఉండనున్నట్టు సమాచారం.

రక్షణ సహకారం – ప్రధాన అజెండా

రక్షణ రంగంలో భారత్–ఇజ్రాయెల్ సంబంధాలు ఇప్పటికే బలంగా ఉన్నప్పటికీ.. ఈ పర్యటనలో డ్రోన్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలు (మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్), సైబర్ సెక్యూరిటీ, రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి అంశాలపై కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అంచనా. చైనా నుంచి ఎదురయ్యే వ్యూహాత్మక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన అధునాతన AI-ఆధారిత రక్షణ సాంకేతికతలను భారత్ ఉపయోగించుకోవాలని చూస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, డిఫెన్స్ AI, స్మార్ట్ సర్వైలెన్స్ టెక్నాలజీలలో భాగస్వామ్యం రెండు దేశాలకు దీర్ఘకాలిక లాభాలు అందించవచ్చని భావిస్తున్నారు.

ఇరాన్ టెన్షన్స్ – వ్యూహాత్మక అడుగు

ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు కూడా ఈ పర్యటనకు ముఖ్య కారణంగా నిలిచాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో బలమైన సంబంధాలు భారత్‌కు ఒక వ్యూహాత్మక బ్యాకప్‌గా ఉపయోగపడవచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి. అదే సమయంలో.. భారత్ ఇరాన్‌తో కూడా కీలక ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తోంది. చాబహార్ పోర్ట్ అభివృద్ధి ద్వారా ఆఫ్ఘనిస్తాన్-మధ్య ఆసియాకు, భారతదేశానికి ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గం సులభంగా లభిస్తోంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు, అలాగే ఇరాన్–రష్యా–చైనాలతో సంబంధాలు కూడా భారత్‌కు ముఖ్యమైన అంశాలు.

కొత్త కూటమి.. "హెగ్జాగాన్ ఆఫ్ ఆలయన్స్"లో భారత్?

మరోవైపు ఈ పర్యటనలో ఇజ్రాయెల్ ప్రతిపాదించిన "హెగ్జాగాన్ ఆఫ్ ఆలయన్స్" (Hexagon of Alliances) అనే కొత్త కూటమిలో భారత్ చేరుతుందా అనే అంశం కూడా ముఖ్యమైన చర్చకు దారి తీస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం ఇజ్రాయెల్, భారత్, గ్రీస్, సైప్రస్ తోపాటు కొన్ని అరబ్, ఆఫ్రికన్, ఆసియా దేశాలు కలిసి ఆరు కోణాల వ్యూహాత్మక కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీని లక్ష్యం ఇరాన్ నేతృత్వంలోని "రాడికల్ షియా యాక్సిస్" (ఇరాన్–హిజ్బుల్లా–హూతీలు)కు ప్రత్యామ్నాయ బలమైన కూటమిని ఏర్పరచడం. అయితే భారత్ ఈ కూటమిలో అధికారికంగా చేరుతుందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఇలాంటి యాంటీ-ఇరాన్ ఫార్మల్ అలయన్స్‌లో చేరడం భారత స్ట్రాటజిక్ ఆటానమీ అంటే స్వతంత్ర విదేశాంగ విధానంపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

"మల్టీ-అలైన్‌మెంట్" విధానానికి మొగ్గు

ఇక ఆర్థిక రంగంలో కూడా ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఇప్పటికే 10 బిలియన్స్ డాలర్లను దాటింది. ఈ వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి వ్యవసాయ సాంకేతికత, నీటి నిర్వహణ, హైటెక్ స్టార్టప్ భాగస్వామ్యాలు, రక్షణ ఉత్పత్తి సంయుక్త ప్రాజెక్టులు వంటి రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ముఖ్యంగా ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లలో భారత్–ఇజ్రాయెల్ సహకారం పెరగవచ్చని అంచనా. మొత్తంగా చూస్తే.. ఈ పర్యటనలో రక్షణ, టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్థిక రంగాల్లో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నప్పటికీ.. హెగ్జాగాన్ ఆఫ్ అలయన్స్‌లో పూర్తి సభ్యత్వం పొందే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. భారత్ తన "మల్టీ-అలైన్‌మెంట్" విధానాన్ని కొనసాగిస్తూ, ఒకవైపు ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటూనే, మరోవైపు ఇరాన్‌తోనూ సంబంధాలను కొనసాగించే వ్యూహాన్ని అనుసరించే అవకాశమే ఎక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అవును.. కాషాయ రంగు..! మోడీ, నెతన్యాహు మధ్య ఆసక్తికర సంభాషణ

Next Story