- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు పరీక్షకు హాజరైన అభ్యర్థి వద్ద లభ్యమైన మొబైల్ ఫోన్..!
కోర్టుల్లో ఎక్సామినర్, కాపీయిస్టు, ప్రాసెస్ సర్వర్ పోస్టులకు సంబంధించి జరుగుతున్న అర్హత పరీక్షలో ఓ అభ్యర్థి ఎగ్జామినేషన్ హాల్‌కే మొబైల్ ఫోన్ తీసుకెళ్లిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఓ పరీక్ష కేంద్రంలో జరిగింది.

దిశ, తిమ్మాపూర్: కోర్టుల్లో ఎక్సామినర్, కాపీయిస్టు, ప్రాసెస్ సర్వర్ పోస్టులకు సంబంధించి జరుగుతున్న అర్హత పరీక్షలో ఓ అభ్యర్థి ఎగ్జామినేషన్ హాల్‌కే మొబైల్ ఫోన్ తీసుకెళ్లిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఓ పరీక్ష కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కోర్టుల్లో పలు పోస్టులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరిగిన పరీక్షలో సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఓ అభ్యర్థి తన వెంట మొబైల్ ఫోన్ ను పరీక్ష కేంద్రం లోకి తీసుకెళ్లాడు. కాగా పరీక్ష మరో 10 నిమిషాల్లో ముగుస్తుందనగా అభ్యర్థి తన వెంట తెచ్చుకున్న మొబైల్ ఫోన్ ను తీసి పలు ప్రశ్నలకు సంబంధించిన జవాబులను వెతుకుతున్న క్రమంలో ఇన్విజిలేటర్ అతన్ని పట్టుకుని మొబైల్ ఫోన్, ప్రశ్నపత్రం లాక్కోవడంతో పాటు అతన్ని వెంటనే వేరే ఆఫీస్ గదిలోకి తరలించారు.
అధికారులు, సిబ్బంది అప్రమత్తత..
అభ్యర్థి తన వెంట మొబైల్ ఫోన్ ను పరీక్ష హాల్ లోకి తీసుకెళ్లాడని గమనించిన అధికారులు వెంటనే అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ లాక్కుని అందులో ఉన్న డేటా మొత్తం పరీక్షించారు. ప్రశ్నాపత్రం ఏదైనా బయటకు పంపించాడా? ఆన్సర్ ప్రశ్నలకు సంబంధించిన జవాబులు ఏమైనా గుర్తించి రాశాడా? ఇలా పలు అంశాల పై సమగ్ర వివరాలు సేకరించారు. జిల్లా కోర్టు పరిపాలనాధికారి మాధవి కూడా పరీక్ష కేంద్రానికి వచ్చి విచారణ జరిపారు. కాగా పరీక్ష కేంద్రం లోకి మొబైల్ ఫోన్ తో వచ్చిన అభ్యర్థిని పరీక్షకు అనర్హుడిగా గుర్తించినట్లు పరీక్ష నిర్వాహకులు పేర్కొన్నారు.
వెక్కిరించిన భద్రతా వైఫల్యం..
ఇదిలా ఉండగా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి జరుగుతున్న పరీక్షల్లో ఉన్నత స్థాయి భద్రత ఏర్పాటు చేయాల్సిన సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించడం తోనే అభ్యర్థి తన వెంట మొబైల్ ఫోన్ ను పరీక్ష కేంద్రం లోకి తీసుకెళ్లాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఓ పరీక్షకు కూడా ఓ వైపు పరీక్ష జరుగుతుంటే మరీ వైపు డీజే సౌండ్ పెట్టి విద్యార్థులు నృత్యాలు చేసినట్లు అప్పట్లో అభ్యర్థులు ఆరోపించారు.అయితే తాజా ఘటన విషయమై అటు కళాశాల యాజమాన్యం గానీ ఇటు పరీక్ష నిర్వాహకులు గాని అభ్యర్థికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు.






