- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గర్భస్థ శిశువు గుండెకు అద్భుత చికిత్స : రెయిన్‌బో హాస్పిటల్ సరికొత్త చరిత్ర
వైద్యశాస్త్ర చరిత్రలో హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ సరికొత్త మైలురాయిని అధిగమించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యశాస్త్ర చరిత్రలో హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ సరికొత్త మైలురాయిని అధిగమించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గర్భస్థ పిండం (ఫెటస్) గుండెకు ఇమ్యునోథెరపీ ద్వారా అత్యంత సంక్లిష్టమైన చికిత్స అందించి వైద్యులు విజయం సాధించారు. ఈ అరుదైన చికిత్సా విధానంపై అంతర్జాతీయ గుర్తింపు పొందిన జేఏసీసీ (జర్నల్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ) నివేదికను ప్రచురించడం విశేషం.
ప్రాణాపాయ స్థితి నుంచి సజీవ ప్రసవం వరకు..
గతంలో గర్భం కోల్పోయిన అనుభవం ఉన్న ఒక 29 ఏళ్ల గర్భిణి, ప్రస్తుత గర్భధారణ సమయంలో తీవ్ర సమస్యలతో ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు పరీక్షించగా, కడుపులోని పిండం గుండె స్పందనలు అతి తక్కువగా ఉండటమే కాకుండా, పంపింగ్ వ్యవస్థ కూడా పూర్తిగా బలహీనపడినట్లు గుర్తించారు. సకాలంలో స్పందించకపోతే శిశువు కడుపులోనే మరణించే ప్రమాదం ఉండటంతో, రెయిన్‌బో వైద్య బృందం ఇమ్యునోథెరపీని ప్రారంభించింది. అత్యాధునిక ఇమేజింగ్ సాంకేతికతను వాడుతూ నేరుగా పిండానికే ఈ చికిత్సను అందించారు. ఫలితంగా శిశువు గుండె పనితీరు సాధారణ స్థితికి చేరుకోవడమే కాకుండా, ఆ తల్లి ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది.
అసలు సమస్య ఏమిటి?
తల్లిలో ఉండే స్టోగ్రెన్స్ సిండ్రోమ్ లేదా సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్ వంటి వ్యాధుల వల్ల విడుదలయ్యే యాంటీబాడీలు ఒక్కోసారి గర్భస్థ పిండంపై దాడి చేస్తాయి. దీనివల్ల శిశువు గుండెకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. గర్భిణీలలో ఎటువంటి పైలక్షణాలు కనిపించకపోవడం వల్ల ఈ సమస్యను గుర్తించడం చాలా కష్టమని, దీనివల్ల కడుపులోనే పిండం చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు వివరించారు.
జేఏసీసీ గుర్తింపు- 5 కేసుల విశ్లేషణ
ఇప్పటివరకు 21 నుంచి 27 వారాల మధ్య గర్భధారణ కాలంలో ఉన్న ఐదుగురు బాధితులకు ఈ తరహా ఇమ్యునోథెరపీని అందించి, వారిని విజయవంతంగా కాపాడినట్లు రెయిన్‌బో వైద్యులు తెలిపారు. ఈ ఐదు కేసుల్లో చికిత్స అందించిన విధానం, శిశువుల గుండె పనితీరులో వచ్చిన మార్పులు వంటి అంశాలను విశ్లేషిస్తూ జేఏసీసీ ప్రచురించిన నివేదిక అంతర్జాతీయంగా వైద్యుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రపంచస్థాయి వైద్య సంస్థల సరసన రెయిన్‌బో...
రోగనిరోధక వ్యవస్థలో వచ్చే మార్పులు పిండం గుండెను వేగంగా బలహీనపరుస్తాయని... లక్షణాలు బయటకు కనిపించకపోవడం వల్ల గుర్తించడంలో జాప్యం జరుగుతుందని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డా. శ్వేతా బబ్రు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఇమ్యునోథెరపీ దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇది సాధారణ చికిత్స కాదని.... శిశువుకు ప్రాణాపాయం ఉన్నప్పుడు మాత్రమే మల్టీ డిసిప్లినరీ వైద్య బృందాల పర్యవేక్షణలో అత్యంత జాగ్రత్తగా చేపడతామని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డా. భార్గవి ధూళిపూడి వెల్లడించారు. ఈ విజయంతో రోగనిరోధక సంబంధిత పిండం గుండె జబ్బుల నిర్వహణలో ప్రపంచస్థాయి వైద్య సంస్థల సరసన రెయిన్‌బో నిలిచిందని సీనియర్ కార్డియాలజిస్ట్ డా. నాగేశ్వరరావు కోనేటి పేర్కొన్నారు. సంక్లిష్టమైన ప్రినేటల్ గుండె సమస్యలతో బాధపడే కుటుంబాలకు ఇది కొత్త ఆశను కలిగిస్తోందని తెలిపారు.






