- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రుల పర్యటనలు హడావుడికే పరిమితం
గద్వాల నియోజకవర్గానికి మంత్రులు వరుసగా పర్యటిస్తున్నప్పటికీ అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయడం లేదని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు విమర్శించారు.

దిశ, జోగులాంబ ప్రతినిధి : గద్వాల నియోజకవర్గానికి మంత్రులు వరుసగా పర్యటిస్తున్నప్పటికీ అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయడం లేదని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి మంత్రులు వచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్‌లో వర్గపోరు, ఆధిపత్య ప్రదర్శనలే కనిపిస్తున్నాయని, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం కనిపించడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వచ్చినప్పటికీ పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారని అన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలకు మాత్రమే పరిమితమవుతూ, ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి చూపడం లేదని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభమైన పనులే ప్రస్తుతం కొనసాగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా గణనీయమైన అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. ర్యాలంపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీపంలోని ర్యాలంపాడు రిజర్వాయర్‌ను సందర్శించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
వ్యవసాయానికి అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు కావడానికి నెలల తరబడి సమయం పడుతోందని, దీంతో రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇటీవల ధరూర్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సభలో మహిళలు వ్యక్తం చేసిన అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జి.రాఘవేంద్ర రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్, చంటన్న, గువ్వల గోపాల్, మోహన్ యాదవ్, చిత్తరి కిరణ్, కమ్మరి రాము, చక్రిధర్ రెడ్డి, బీచుపల్లి వెంకటేష్ యాదవ్, తిమ్మప్ప గౌడ్, శ్రీరాములు, పూడూరు రఘు నాయుడు, గంజిపేట అరవింద్, మాలిక్, రాము, లోకేష్, భాస్కర్, జగదీష్, నరసింహులు, గోవిందు, వీరేష్, రాజు, మహేష్, కృష్ణ, మహేందర్, నరేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






