ఇలా చేస్తే.. రైతులకు సాగుఖర్చు ఆదా: మంత్రి తుమ్మల

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో లేదని, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ పామ్ కంపెనీల జోన్లను రద్దు చేసి, ఆసక్తి కలిగిన ఇతర కంపెనీలకు ఇవ్వాలని అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు.

ఇలా చేస్తే.. రైతులకు సాగుఖర్చు ఆదా: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో లేదని, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ పామ్ కంపెనీల జోన్లను రద్దు చేసి, ఆసక్తి కలిగిన ఇతర కంపెనీలకు ఇవ్వాలని అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. గురువారం సచివాలయంలో టీజీ ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విత్తనోత్పత్తి సంస్థల అధికారులతో సంస్థల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేటాయించిన లక్ష్యాలను చేరుకోకపోవడంతో కరీంనగర్, ఆసిఫాబాద్, వరంగల్ , హన్మకొండ జిల్లాలలోని ప్రైవేట్ ఆయిల్ పామ్ కంపెనీలకు సంబంధించిన జోన్లను ఇప్పటికే రద్దు వాటిని ఆయిల్ ఫెడ్ సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. నిర్ధిష్ట లక్ష్యాలను చేరుకోవడంలో ఆయిల్ ఫెడ్ సంస్థ కూడా విఫలమైతే ఆ సంస్థకు సంబంధించిన జోన్లను కూడా రద్దు చేస్తామన్నారు. ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని పెంచడమే ప్రభుత్వం ఉద్దేశ్యమని, అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైన తీసుకుంటామన్నారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్ త్వరితగతిన విస్తరణ కోసం అవసరమైన చోట అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను చేర్చుకోవాలని ఆయిల్ ఫెడ్ ఎండీకి సూచించారు. అయిల్ పామ్ సాగుకు అవసరమైన పనిముట్లను వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగం చేయాలన్నారు.

రైతులకు సాగు ఖర్చు ఆదా

దీంతో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సాగు ఖర్చు ఆదా అవుతుందని, రైతులు సాగు కోసం చేసే ఖర్చును తగ్గించడానికి అవసరమైన అన్ని అవకాశాలను పరిశీలించాలన్నారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ అనంతరం వచ్చే వ్యర్థాల నుండి ఉప ఉత్పత్తులను తయారుచేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కల్లూరుగూడం, బీచుపల్లిలోని ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల పనులను వేగవంతం చేయాలన్నారు. ఆయిల్ పామ్ సాగులో దిగుబడి పెంచడం కోసం ఆయిల్ పామ్ రైతులకు ట్రైకోడర్మా, గానోడెర్మా నిరోధక బయో ఫర్టిలైజర్లు అయిన వీఎయం, మెగ్నీషియం, సల్ఫర్ మొదలైన వాటిని 50 శాతం సబ్సిడీతో రైతులకు అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర సేవల కోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లను పామ్ ఆయిల్ రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయిల్ ఫెడ్ ఎండీకి సూచించారు. ఆయిల్ పామ్ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి పామ్ ఆయిల్‌పై ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకం 16.5 శాతం నుండి గతంలో మాదిరిగా 44 శాతానికి పెంచాలని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహన్ చపియూష్ గోయల్‌తో పాటు ప్రధాని మోడీకి కూడా లేఖ రాసినట్లు పేర్కొన్నారు.

మొక్క జోన్న ధాన్యానికి టెండర్లు పిలిచి అమ్మకాలు చేపట్టాలి :

మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన జొన్న, మొక్కజొన్న ధాన్యానికి వెంటనే టెండర్లు పిలిచి అమ్మాలని మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. ప్రొక్యూర్ మెంట్, సీడ్ వెరైటీలు, స్టోరేజీల నిర్వహణలకు సంబంధించి ఇంకా పాత పద్ధతులనే అవలంభిస్తున్నామని, పెరుగుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాలను రూపొందించాలన్నారు. మార్క్ ఫెడ్ లాంటి సంస్థల ద్వారా కేవలం మన రాష్ట్రంలోనే ఇంత పెద్దమొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, రైతులకు నష్టం రావొద్దనే ఉద్దేశ్యంతేనే చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి కూడా నష్టం రాకుండా ప్రణాళికలు తయారుచేసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములలో ఎక్కువ కాలం స్టోరేజీ చేయకుండా, పంట పాడవకముందే మంచి ధర రాగానే అమ్ముకోవాలన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యత కలిగిన అధిక దిగుబడి వచ్చే విత్తనాలను తయారుచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని విత్తనాభివృద్ధి సంస్థ ఎండీకి సూచించారు. ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా విత్తనాభివృద్ధి సంస్థ కూడా విత్తనాలను ఉత్పత్తి చేయాలన్నారు. సీజన్‌కు ముందే రైతు సాగుచేసే విస్తీర్ణాన్ని అంచనా వేసి, అందుకు అనుగుణంగా విత్తనాలను కొనుగోలు చేయాలని అన్నారు. రైతులు విత్తనాభివృద్ధి సంస్థ తయారుచేసే విత్తనాలనే కొనుగోలు చేసేలా వారిలో నమ్మకం కల్పించాలని, అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, సీడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థల ఎండీ యాస్మిన్ బాషా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story