- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాటలతో కాదు.. చేతలతో నిరూపిస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది ఆరోగ్యకరమైన సంప్రదాయమని, అయితే అది వాస్తవాల ఆధారంగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది ఆరోగ్యకరమైన సంప్రదాయమని, అయితే అది వాస్తవాల ఆధారంగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తుందని ఆయన అన్నారు. కానీ రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని హెచ్చరించారు. శనివారం సెక్రటేరియట్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, పెట్టుబడులు రావడం లేదంటూ కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎకానమిక్ సర్వే 2025–26 పూర్తిగా ఖండించిందన్నారు. ఈ సర్వే కేవలం గణాంకాల పుస్తకం కాదని, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రగతి నివేదిక అని పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ‘తెలంగాణ’ బ్రాండ్ ను దెబ్బతీసేలా... తమ ప్రభుత్వ పనితీరు, చిత్తశుద్ధిపై కొందరు అబద్ధాల పునాదులపై చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ‘ఎకానమిక్ సర్వే 2025-26’ పటాపంచలు చేసిందన్నారు. టెక్నాలజీని మిళితం చేస్తూ వ్యవస్థలను ప్రక్షాళన చేసేలా... అవినీతికి చెక్ పెట్టేలా.. పారదర్శకతకు పెద్దపీట వేసేలా.. గుడ్ గవర్నెన్స్ లక్ష్యంగా... తాము అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలను ఈ సర్వే అధికారికంగా గుర్తించిందన్నారు. ఈ దేశానికి ‘తెలంగాణ రైజింగ్’ను కళ్లకు కట్టిందన్నారు. వార్షిక వృద్ధిలో తెలంగాణ సాధిస్తూ దూసుకుపోతుంటే.. రాష్ట్రం వెనుకబడిందంటూ తమపై దుష్ర్పచారం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తాము సంపదను సృష్టిస్తూ... ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని... భావితరాల భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్నామని తెలిపారు.
ఆర్థిక స్థిరత్వానికి బలమైన ఆధారాలు
తెలంగాణలో ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన పరిమితుల్లోనే ఉందని మంత్రి తెలిపారు. 2024–25లో జాతీయ సగటు ద్రవ్యోల్బణం 4.63 శాతంగా ఉంటే, తెలంగాణలో 3.67 శాతమే ఉందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్–డిసెంబర్) జాతీయ సగటు 1.72 శాతంగా ఉంటే, తెలంగాణలో కేవలం 0.20 శాతమే ఉందని సర్వే స్పష్టం చేసిందన్నారు. రాష్ట్రం కేవలం కేంద్ర నిధులు లేదా అప్పులపై ఆధారపడడం లేదని, సొంత పన్ను వనరుల ద్వారానే అత్యధిక ఆదాయాన్ని సమీకరిస్తూ ఆర్థికంగా బలంగా నిలిచిందని చెప్పారు. ఇది ప్రభుత్వ సమర్థతకు, పారదర్శక ఆర్థిక నిర్వహణకు నిదర్శనమని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి మున్సిపల్ బాండ్ల జారీలో జి.హెచ్.ఎం.సి దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రాష్ట్ర ప్రభుత్వం, మన ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లకు ఉన్న తిరుగులేని విశ్వాసానికి నిదర్శనమన్నారు. పెట్టుబడిదారులు తెలంగాణపై విశ్వాసం చూపిస్తుండటం ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు, పారదర్శకతకు లభించిన గొప్ప గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.
ఐటీ, ఇన్నోవేషన్, పరిశ్రమల్లో తెలంగాణ దూకుడు..
ఐటీ, ఇన్నోవేషన్, ఏఐ రంగాల్లో తెలంగాణ దేశానికే దిక్సూచి అవుతోందని మంత్రి తెలిపారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకే కాకుండా, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణ ఎదిగిందని కేంద్ర సర్వే స్పష్టం చేసిందన్నారు. జెన్-ఏఐ స్టార్టప్‌లలో దేశవ్యాప్తంగా 7 శాతం వాటాతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలవడం గర్వకారణమని చెప్పారు. దేశ సేవల రంగంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వాటాలో కేవలం నాలుగు రాష్ట్రాలు 40 శాతం వాటాను కలిగి ఉంటే, అందులో తెలంగాణ కూడా ఉండటం రాష్ట్ర ఆర్థిక బలాన్ని చాటుతోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో పనివేళల ఆంక్షలను తొలగించి, అన్ని పరిశ్రమల్లో 24/7 సురక్షితంగా పనిచేసే అవకాశాలు కల్పించామని మంత్రి గుర్తు చేశారు. ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్న దేశంలోని ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలవడం ప్రభుత్వ దార్శనికతకు నిదర్శనమన్నారు.
హైదరాబాద్ గ్లోబల్ పవర్‌హౌస్‌గా ఎదుగుతోంది
హైదరాబాద్‌ను కేవలం ఐటీ నగరంగా కాకుండా, అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని కేంద్ర సర్వే ప్రశంసించిందని మంత్రి తెలిపారు. 2019–2035 మధ్య 8.47 శాతం వార్షిక జీడీపీ వృద్ధితో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నాలుగో నగరంగా హైదరాబాద్ నిలవబోతోందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసిందన్నారు. 2018లో 50.6 బిలియన్ డాలర్లుగా ఉన్న హైదరాబాద్ జీడీపీ, 2035 నాటికి 201.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొన్నారు. భూ భారతి పోర్టల్, జీపీఎస్ ఆధారిత వాహన ట్రాకింగ్ వ్యవస్థ, స్మార్ట్ ట్రైబల్ ఫార్మింగ్ వంటి సంస్కరణలు పాలనలో పారదర్శకతను పెంచాయని మంత్రి తెలిపారు. అవినీతికి చెక్ పెట్టేలా టెక్నాలజీని మిళితం చేస్తూ అమలు చేస్తున్న సంస్కరణలను కేంద్ర సర్వే అధికారికంగా గుర్తించిందన్నారు. తెలంగాణ బ్రాండ్‌ను దెబ్బతీసే గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని, అభివృద్ధి అంటే మాటలు కాదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమేనని తమ ప్రభుత్వం చేతలతో నిరూపిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.






