కేటీఆర్ ఎక్కడ..? ఆచూకీ లేని హరీశ్ రావు!

by Disha Web Desk |
కేటీఆర్ ఎక్కడ..? ఆచూకీ లేని హరీశ్ రావు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : వడ్ల నిరసన దీక్షలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కనిపించలేదు. ఇద్దరు మంత్రులు హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపి రైతులకు భరోసా నివ్వాల్సిన వారు పాల్గొనకపోవడంతో కొంత నైరాశ్యం నెలకొంది. మరోవైపు కేసీఆర్, కవిత ఢిల్లీలో ఉన్నారు. అయితే కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు నిరసన దీక్షలో పాల్గొనలేదు.

కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసేలా ఉద్యమించాలని..

పార్టీ శ్రేణులంతా నిరసన దీక్షలో పాల్గొనాలని, రైతులను భాగస్వాములను చేయాలని మంత్రి కేటీఆర్ ఈ నెల 2న తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పిలుపు నిచ్చారు. ఈ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టారు. నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనగా, మండల కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దీక్ష కొనసాగింది. పలు మండలాల్లో ధర్నాలు సైతం నిర్వహించి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు గుజరాత్ మాదిరిగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనన్నారు. ధాన్యం కొనుగోలు చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

దీక్షలో కనిపించని కేటీఆర్, హరీష్ రావు

పార్టీ శ్రేణులంతా మండల కేంద్రాల్లో జరిగిన నిరసనదీక్షలో పాల్గొంటే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మాత్రం హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. హరీష్ రావు వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆసుపత్రుల్లో ఖాళీలు, అధికారుల పనితీరుపై సమీక్షలతో బిజీబిజీగా గడిపారు. కేటీఆర్ మధ్యాహ్నం నుంచి గ్రేటర్ పరిధిలో జరిగిన వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. దీంతో ఇద్దరు పాల్గొనకపోవడం పార్టీలో చర్చనీయాశంగా మారింది.


Next Story