అనన్య రిసార్ట్‌లో మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ

by Malleboina Mahesh |

అనన్య రిసార్ట్‌లో అక్రమాలపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం. పన్నుల ఎగవేత, నిర్లక్ష్యపు నిర్వహణపై సీరియస్.. లీజు రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలని ఆదేశం.

అనన్య రిసార్ట్‌లో మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హయత్ నగర్ లోని మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్క్ లోని అనన్య రిసార్ట్‌ను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసార్ట్ నిర్వహణలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో అధికారులతో కలిసి ఆమె తనీఖీలు నిర్వహించారు. రిసార్ట్‌లో సందర్శకులకు కనీస వసతులు కూడా సక్రమంగా అందించడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్స్, స్విమ్మింగ్ పూల్, కాటేజీలు, కిచెన్ తదితర విభాగాల్లో నిర్వహణ చాలా నిర్లక్ష్యంగా ఉందని గుర్తించారు. పర్యాటకులు, కుటుంబాలతో వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉండడం ఆందోళనకరమని అన్నారు.

10 ఏండ్లుగా..

పదేళ్లుగా ఈ రిసార్ట్‌ను ఒక ప్రైవేట్ సంస్థ లీజ్‌కు తీసుకుని నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వ నిబంధనలను పాటించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని గుర్తించారు. ఈ కాలంలో ప్రభుత్వానికి కేవలం ఒక్కసారి మాత్రమే పన్నులు చెల్లించినట్టు తనిఖీలో వెల్లడైందని పేర్కొన్నారు. దీంతోపాటు రిసార్ట్‌లో బుకింగ్స్‌ను సరైన బిల్లులు ఇవ్వకుండా నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించామని మంత్రి తెలిపారు. బిల్స్ లేకుండా బుకింగ్స్ చేయడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దాచిపెట్టే విధంగా కార్యకలాపాలు నిర్వహించడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని అన్నారు.

సిబ్బందికి వేతనాలివ్వడంలో..

రిసార్ట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా సరైన విధంగా జీతాలు చెల్లించడం లేదని, అకౌంట్ పే ద్వారా కాకుండా ఇతర విధానాల్లో చెల్లింపులు జరుగుతున్నట్టు తనిఖీలో తేలిందని వారికి పీఎఫ్ వంటి బీమా సౌకర్యాలు కూడా కల్పించలేదని ఇది కార్మిక చట్టాలకు విరుద్ధమన్నారు.. ఇక అటవీ ప్రాంతంలో నిర్వహించే ఎకో టూరిజం కార్యకలాపాలు ప్రకృతి పరిరక్షణకు అనుగుణంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ పార్క్ పరిధిలో జరిగే కార్యకలాపాలు పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు అనుగుణంగా ఉండాలి తప్ప వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకూడదని తెలిపారు.

ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో ప్రైవేట్ సంస్థ వద్ద ఉన్న రిసార్ట్ నిర్వహణను పూర్తిగా రద్దు చేసి, అటవీశాఖ స్వాధీనం చేసుకునే చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం ఈ ప్రాంతాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసి, ఎకో టూరిజం ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆమె వెంట సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, రంగారెడ్డి డీఎఫ్ఓ రోహిత్ గోపిడి, ఎఫ్డీఓ వెంకటయ్య, ఎఫ్ఆర్ఓ సాయి ప్రకాశ్ ఉన్నారు.

Next Story