- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రిగారూ.. మాటలవరకేనా..? చేతలు ఎప్పుడు..?
సొంత జిల్లా నాయకుడు.. రాష్ట్రంలో కీలకమైన మంత్రి స్వయంగా వచ్చి రోడ్డు వేయిస్తానని ఇచ్చిన హామీ కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం గతుకుల రోడ్డు, నరకప్రాయమైన ప్రయాణం! నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చెరువుపల్లి గ్రామ ప్రజల దుస్థితి ఇది.

దిశ, మాడుగులపల్లి : సొంత జిల్లా నాయకుడు.. రాష్ట్రంలో కీలకమైన మంత్రి స్వయంగా వచ్చి రోడ్డు వేయిస్తానని ఇచ్చిన హామీ కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం గతుకుల రోడ్డు, నరకప్రాయమైన ప్రయాణం.. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చెరువుపల్లి గ్రామ ప్రజల దుస్థితి ఇది. స్వయంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఓ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇంత దారుణంగా తయారవ్వడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువుపల్లి గ్రామానికి వెళ్లాలంటేనే వాహనదారులు, ప్రజలు నరకం చూస్తున్నారు.
అవస్థల్లో రోగులు, గర్భిణులు..
ఈ రోడ్డు అధ్వాన్నంగా మారడంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, అత్యవసర ఆపదలో ఉన్న రోగులను ఆసుపత్రికి తరలించాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించిందని, రోడ్డుపై ఉన్న గుంతల వల్ల ఆటోలు, వాహనాలు నడపలేక డ్రైవర్లు సైతం ఇటువైపు రావడానికి భయపడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి హామీ ఏమైంది?
గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెరువుపల్లి గ్రామానికి వచ్చినప్పుడు ఈ రోడ్డు దుస్థితిని గమనించారు. రోడ్డు చాలా దారుణంగా ఉందని, తానే స్వయంగా చొరవ తీసుకుని త్వరలోనే కొత్త రోడ్డు పనులు చేయిస్తానని గ్రామస్తుల సమక్షంలోనే బహిరంగంగా హామీ ఇచ్చారు. మంత్రిగారు స్వయంగా మాట ఇవ్వడంతో తమ కష్టాలు తీరుతాయని గ్రామ ప్రజలు ఆశపడ్డారు. కానీ, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ రోడ్డుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
మాటలవరకేనా.. పనులు ఎప్పుడు?
పలుమార్లు ఈ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా, నేరుగా మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. మంత్రి మాటలు కేవలం పర్యటనల వరకేనా..? మాకు చేతల్లో చూపించేది ఎప్పుడు..? అని చెరువుపల్లి గ్రామస్తులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే నిధులు మంజూరు చేసి చెరువుపల్లి గ్రామ రోడ్డు పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
స్థానికుల మాట..
మంత్రి స్వయంగా రోడ్డు వేయిస్తానని చెప్పి వెళ్లారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చలనం లేదు. రాత్రి వేళల్లో ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఆసుపత్రికి తీసుకెళ్లడం ఒక పెద్ద యుద్ధంలా మారింది.






