'ఎన్టీఆర్‌కు మించి గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి జగన్'

by Disha Web Desk 5 |
ఎన్టీఆర్‌కు మించి గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి జగన్
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ఇటీవలే జిల్లాల విభజన ప్రక్రియ పూర్తైన సంగతి తెలిసిందే. వెంకటగిరి నియోజకవర్గాన్ని తిరుపతి బాలాజీ జిల్లాలో కలిపారు. దీంతో వెంకటగిరి నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంకటగిరిని తిరుపతి బాలాజీ జిల్లాలో కలిపినందుకు కృతజ్ఞతగా మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తిలు కేక్ కట్ చేసి సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జైజగన్.. జై ఆనం నినాదాలతో పార్టీ నేతలు కార్యకర్తలు హల్ చల్ చేశారు. అంతేకాదు చిన్నారులకు టెట్రామిల్క్, బిస్కెట్ పాకెట్స్, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. పునర్విభజనలో న్యాయం చేయాలని తాను చేసిన అభ్యర్థనను సీఎం వైఎస్ జగన్ పరిగణలోకి తీసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ ప్రాంత వాసుల వెనుకబాటుతనాన్ని, బాధలని గుర్తించి వెసులుబాటు కల్పించారని చెప్పుకొచ్చారు. ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా అన్ని ప్రాంతాలకు సీఎం జగన్ న్యాయం చేశారని మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను వదిలిపారిపోయిన వాళ్లను నమ్మెుద్దు

'సుపరిపాలన సాగిస్తున్న సీఎం జగన్ చిత్రం పసిహృదయాల్లో కూడా నిలిచిపోవాలి. సీఎం చేసిన మంచికి గుర్తుగా 20 వేల మంది పిల్లలకు టెట్రా మిల్క్ ,బిస్కెట్ పాకెట్స్ అందిస్తున్నాం. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే 13 జిల్లాలను 26 జిల్లాలను చేశారు. నాడు మాండలీక వ్యవస్థతో మంచి చేయాలని ఎన్టీఆర్ కృషిచేశారు. నేడు అంతకు మించి ఆలోచించిన గొప్పవ్యక్తి సీఎం వైఎస్ జగన్' అని మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. అధికారులను సమన్వయం చేసుకొంటూ ముందుకు పోవటం వైఎస్సార్ నేర్పిన విద్య. ఇద్దరు కలెక్టర్లు ,ఇద్దరు ఎస్పీలను సమన్వయం చేసుకొని నియోజక వర్గ అభివృద్ధికి పాటుపడతా. 2009 లో స్వార్ధ ప్రయోజనాలకోసం రాపూరు నియోజకవర్గాన్ని లేకుండా చేశారు. స్థానం లేక ఆత్మకూరు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. వైఎస్ జగన్ వెంకటగిరినుంచి అవకాశం ఇచ్చారు. బంపర్ మెజారిటీతో ప్రజలు ఆశీర్వదించారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా.. ఈ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తా. ప్రజాస్వామ్య వ్యవస్థను వదిలి పారిపోయినవాళ్లు ఇప్పుడు ఉద్ధరిస్తామని వస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన సీఎం వైఎస్ జగన్‌కు అండగా నిలుద్దాం. ఈ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ది చెందాలంటే అది వైఎస్ జగన్ ఒక్కడివల్లే సాధ్యమౌతుంది అని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.

Next Story