60 ఏళ్ల వయసులో మిలింద్ సోమన్ అద్భుత సాహసం

by Muthe.Rajitha |

ఫిట్‌నెస్ ఐకాన్ మిలింద్ సోమన్ యూరప్ ఖండం నుండి ఆఫ్రికా ఖండం వరకు సముద్రంలో ఈత కొట్టి సరికొత్త రికార్డు సృష్టించారు.

60 ఏళ్ల వయసులో మిలింద్ సోమన్ అద్భుత సాహసం
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిట్‌నెస్ ఐకాన్ మిలింద్ సోమన్ తన సాహసంతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. 60 ఏళ్ల వయసులో కూడా వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ, యూరప్ ఖండం నుండి ఆఫ్రికా ఖండం వరకు సముద్రంలో ఈత కొట్టి సరికొత్త రికార్డు సృష్టించారు. స్పెయిన్‌లోని టారిఫా (Tarifa) నుండి మొరాకో తీరం వరకు ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్ (Strait of Gibraltar) జలసంధిని ఆయన విజయవంతంగా దాటారు. సుమారు 15 కిలోమీటర్ల మేర సాగిన ఈ సాహసోపేతమైన ప్రయాణాన్ని మిలింద్ తన బృందంతో కలిసి కేవలం 4.5 గంటల్లోనే పూర్తి చేయడం విశేషం. సముద్రంలో ఉండే బలమైన అలలు, అనూహ్యమైన ప్రవాహాలు, నిరంతరం కొనసాగే భారీ ఓడల రాకపోకల మధ్య మిలింద్ తన ఈతను సునాయాసంగా పూర్తి చేయడం విశేషం.

ఈ అద్భుత ఘనత సాధించిన అనంతరం మిలింద్ సోమన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. "మే 1వ తేదీన నేను యూరప్ నుండి ఆఫ్రికాకు ఈత కొట్టాను.. స్పెయిన్‌లోని టారిఫా నుండి మొరాకో తీరం వరకు సుమారు 15 కిలోమీటర్ల దూరం.. ఇది తనకు బ్యూటిఫుల్ మెమరీ" అంటూ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఐరన్‌మ్యాన్ ట్రయాత్లాన్ వంటి కఠినమైన పోటీల్లో పాల్గొని తన సత్తా చాటిన ఆయన, ఇప్పుడు 60 ఏళ్ల వయసులో ఈ ఓపెన్ వాటర్ స్విమ్ పూర్తి చేయడం ఫిట్‌నెస్ ప్రేమికులకు గొప్ప స్ఫూర్తినిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు, అభిమానులు ఆయనను 'అల్టిమేట్ ఫిట్‌నెస్ మెషిన్' అని కొనియాడుతున్నారు.

Next Story