ఐటీ ఇండస్ట్రీకి AI గండం.. 12 నెలల్లో వైట్ కాలర్ జాబ్స్ మాయం : మైక్రోసాఫ్ట్ AI చీఫ్

by Muthe.Rajitha |

ఐటీ ఉద్యోగుల పాలిట పెను శాపంగా మారనుంది AI.

ఐటీ ఇండస్ట్రీకి AI గండం.. 12 నెలల్లో వైట్ కాలర్ జాబ్స్ మాయం : మైక్రోసాఫ్ట్ AI చీఫ్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో పెద్ద చర్చకు తెరలేచింది. మైక్రోసాఫ్ట్ కు చెందిన AI విభాగం అధిపతి ముస్తఫా సులేమాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఐటీ టెక్కీస్ ను బెంబేలెత్తిస్తున్నాయి. రాబోయే ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల్లో డెస్క్ జాబ్స్‌లో చేసే అనేక పనులను AI భర్తీ చేయగలదని బాంబ్ పేల్చారు. ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముస్తఫా మాట్లాడుతూ.. లాయర్లు, అకౌంటెంట్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, మార్కెటింగ్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు వంటి కంప్యూటర్ ముందు పనిచేసే ఉద్యోగాల్లో పెద్ద మార్పు రానుందని తెలిపారు. రిపోర్టులు తయారు చేయడం, డేటా విశ్లేషణ, లెక్కలు వేయడం, ఇమెయిల్స్ రాయడం, కోడింగ్ వంటి పునరావృత పనులను AI అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో చేయగలదని వివరించారు.

ముఖ్యంగా AI ఏజెంట్ల అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ఒకేసారి అనేక దశల్లో జరిగే పనులను కూడా ఈ AI సిస్టమ్స్ పూర్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయని చెప్పారు. భవిష్యత్తులో సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక AI మోడల్స్‌ను సులభంగా రూపొందించుకునే స్థితి వస్తుందని అంచనా వేశారు. ముస్తఫా చేసిన వ్యాఖ్యలు ఐటీ రంగంలో.. ముఖ్యంగా భారతదేశం వంటి ఐటీ రంగంపై ఆధారపడిన దేశాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే కోడింగ్, కంటెంట్ రైటింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి రంగాల్లో AI వినియోగం పెరుగుతోంది. దీంతో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఐటీ నిపుణులు ఏం చెబుతున్నారంటే.. AI రిపిటేడెడ్ పనులను వేగంగా చేయగలిగినా, సృజనాత్మకంగా ఆలోచించి చేసే పనులు, నాయకత్వం, నిర్ణయాల తీసుకోవడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వంటి అంశాల్లో మానవుల పాత్ర ఇంకా కీలకమని.. ఈ రంగాల్లో ఉద్యోగాలు AI తో పెద్దగా ఎఫెక్ట్ కావని అంటున్నారు. టెక్నాలజీ మార్పులను అంగీకరించి, కొత్త నైపుణ్యాలను అలవర్చుకుంటే భవిష్యత్తులో అవకాశాలు కొనసాగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story