ఘోర రోడ్డు ప్రమాదం.. పిల్లర్‌ను ఢీకొట్టిన కారు, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం

by Malleboina Mahesh |   (  Updated:2026-01-28 02:59:44  IST  )

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌ నగరం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం..  పిల్లర్‌ను ఢీకొట్టిన కారు, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్/మేడిపల్లి: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పిల్లర్‌ (Metro Pillar)ను ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌ నగరం మేడిపల్లి పోలీస్ స్టేషన్ (Medipalli Police Station) పరిధిలో చోటుచేసుకుంది. మౌలాలి లోని స్నేహితుడి ఇంటి వద్ద జరిగిన ఫంక్షన్ కి నిఖిల్ (22) కారులో వెళ్లి వస్తూ పోచారం సద్భావన టౌన్షిప్ లో ఉంటున్న స్నేహితులను దింపేందుకు వెళ్ళుతుండగా మేడిపల్లి లోని ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్, పిల్లర్ నెంబర్ 97 వద్దకు రాగానే వాహనం అదుపుతప్పింది. దీంతో పిల్లర్ నెంబర్ 97 ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా, వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు సాయి వరుణ్, నిఖిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు వేగంగా ఢీకొనడంతో వాహనం నుజ్జునుజ్జు అయింది. కాగా కారు పరిస్థితిని చూస్తే ప్రమాద తీవ్రతను స్పష్టం చేస్తోంది.

ఇదిలా ఉంటే ఈ ఘటనలో వెంకట్, రాకేష్, యశ్వంత్ అనే ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ అనే మరో ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story