మేడిగడ్డ బ్యారేజ్‌కు కేంద్రం రెడ్ అలర్ట్

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-29 12:40:07  IST  )

మేడిగడ్డ ప్రాజెక్టుకు కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.

మేడిగడ్డ బ్యారేజ్‌కు కేంద్రం రెడ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మేడిగడ్డ ప్రాజెక్టు(Medigadda Barrage)కు కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేటగిరీ 1 ప్రమాదకర డ్యామ్‌గా మేడిగడ్డను గుర్తించింది. 2025 పోస్ట్ మాన్‌సూన్ తనిఖీల్లో కేంద్రం తీవ్ర లోపాలను గుర్తించింది. మేడిగడ్డ లోపాలను పరిష్కరించకపోతే ప్రమాదమని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి, ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లడానికి నిర్మాణ సంస్థే ప్రధాన కారణమని పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం తేలింది. ముఖ్యంగా సీకెంట్‌ పైల్స్‌ వేయడంలో నిబంధనలు పాటించకపోవడం, పని పూర్తయిన తర్వాత కాఫర్‌డ్యాంను తొలగించకపోవడం వల్ల నీటి ప్రవాహంలో మార్పులు వచ్చి నిర్మాణం దెబ్బతిన్నట్లు గుర్తించారు. 20వ పిల్లర్ కుంగిన తర్వాత ఆధారాలను తొలగించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని విజిలెన్స్‌ ఆరోపించింది. రూ.4,613 కోట్లకు అంచనాలను సవరించి, బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకముందే పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రం కోరడంపై కూడా గతంలో విచారణ జరిపారు.

ఎప్పుడు కుంగిందంటే?

ఇదిలా ఉంటే.. 2023 అక్టోబరు 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగింది. సంవత్సరాలు పూర్తవుతున్నా, బ్యారేజీ మరమ్మతులు/పునరుద్ధరణ అంతుచిక్కని అంశంగా మారింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ భారీగా సీపేజీలు బయటపడ్డాయి. ఈ రెండు బ్యారేజీలను తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది. ఈ బ్యారేజీల్లో నీటి నిల్వ శ్రేయస్కరం కాదని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ హెచ్చరించింది. దాంతో ఈ బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ 2024 ఫిబ్రవరి 13వ తేదీన జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చైర్మన్‌కు తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా లేఖ రాయగా 2024 మార్చి 2న కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఆరుగురితో ప్రభుత్వం కమిటీ వేసింది. ఇది జరిగి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 8 బ్లాకులుగా కట్టగా ఒక్కో బ్లాకులో 10-11 దాకా పియర్లు ఉన్నాయి. బ్యారేజీకి మొత్తం 85పియర్లు ఉండగా ఏ ఒక్క పియర్‌లో సమస్యలు తలెత్తినా, ఆ బ్లాకులోని మొత్తం పియర్లను తొలగించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కేంద్ర హెచ్చరిక నోటీసుల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

Next Story