ఫిఫా వరల్డ్ కప్ : ఎంబాపె వీర విహారం.. ఫ్రాన్స్ విజయం

by Muthe.Rajitha |

ఫిఫా ప్రపంచకప్‌ (FIFA World Cup) మెగా టోర్నీలో టైటిల్‌ ఫేవరేట్‌లలో ఒకటైన ఫ్రాన్స్‌ జట్టు తన జైత్రయాత్రను ఘనంగా ఆరంభించింది.

ఫిఫా వరల్డ్ కప్ : ఎంబాపె వీర విహారం.. ఫ్రాన్స్ విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిఫా ప్రపంచకప్‌ (FIFA World Cup) మెగా టోర్నీలో టైటిల్‌ ఫేవరేట్‌లలో ఒకటైన ఫ్రాన్స్‌ జట్టు తన జైత్రయాత్రను ఘనంగా ఆరంభించింది. గ్రూప్‌-ఐలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-1 తేడాతో సెనెగల్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా తనపై ఉన్న భారీ అంచనాలను నిజం చేస్తూ ఫ్రాన్స్‌ స్టార్‌ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె రెండు సూపర్‌ గోల్స్‌తో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

తొలి అర్ధభాగంలో 'నువ్వా-నేనా'

మ్యాచ్ ప్రారంభమైన మొదటి హాఫ్‌లో ఇరు జట్లు గోల్ కోసం 'నువ్వా-నేనా' అన్నట్లు తలపడ్డాయి. ఫ్రాన్స్ కళ్లు చెదిరే దాడులు చేసినప్పటికీ.. సెనెగల్ డిఫెండర్లు ప్రాణాలు పణంగా పెట్టి అడ్డుకున్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్ డేంజర్ మ్యాన్ ఎంబాపెను కట్టడి చేయడానికి సెనెగల్ ఆటగాళ్లు శతవిధాలా ప్రయత్నించి సఫలమయ్యారు. మరోవైపు సెనెగల్ కూడా ఫ్రాన్స్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా కొన్ని ప్రమాదకర కౌంటర్ అటాక్స్ చేసింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి ఇరు జట్లు ఎలాంటి గోల్ చేయలేకపోయాయి.

సెకండ్ హాఫ్‌లో ఎంబాపె మ్యాజిక్!

ద్వితీయార్ధంలో ఫ్రాన్స్ ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఆట 66వ నిమిషంలో ఎంబాపె తన అద్భుతమైన మ్యాజిక్‌తో సెనెగల్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ తొలి గోల్‌ కొట్టాడు. దాంతో ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఫ్రాన్స్ ఒత్తిడిని మరింత పెంచింది. ఆట 82వ నిమిషంలో బ్రాడ్లీ బార్కోలా మరో సూపర్‌ గోల్‌ సాధించడంతో ఫ్రాన్స్‌ ఆధిక్యం 2-0కి పెరిగింది.

ఆఖరి నిమిషాల్లో హైడ్రామా..

మ్యాచ్ ముగిసే సమయానికి అదనపు సమయంలో సెనెగల్‌ ఆటగాడు ఇబ్రహీం ఎంబాయె ఒక గోల్‌ కొట్టి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. దీంతో సెనెగల్ క్యాంప్‌లో ఆశలు చిగురించాయి. అయితే ఆ ఆనందం వారికి ఒక్క నిమిషం కూడా నిలవలేదు. మరుసటి నిమిషంలోనే ఎంబాపె దాదాపు 30 మీటర్ల దూరం నుంచి నమ్మశక్యం కాని రీతిలో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి లాంగ్-రేంజ్ వండర్ గోల్ చేశాడు. ఈ మెరుపు గోల్‌తో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. అంతేకాదు ఈ మ్యాచ్‌తో ఎంబాపె ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డును నెలకొల్పాడు.

Next Story