తొలకరి వర్షాలకు.. జోరందుకున్న వ్యవసాయ పనులు

by Batti.Sumithra |

తొలకరి వర్షాలకు ఖరీఫ్ పంటలు వేసేందుకు రైతులు విత్తనాలు వేసేందుకు దుక్కులు దున్నడంలో నిమగ్నమై ఉన్నారు.

తొలకరి వర్షాలకు.. జోరందుకున్న వ్యవసాయ పనులు
X

దిశ, వికారాబాద్ ప్రతినిధి : తొలకరి వర్షాలకు ఖరీఫ్ పంటలు వేసేందుకు రైతులు విత్తనాలు వేసేందుకు దుక్కులు దున్నడంలో నిమగ్నమై ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో తొలకరి వర్షాలకు పత్తి, కంది, మొక్కజొన్న, పెసలు తదితర విత్తనాలు వేయడంలో రైతులు బిజీబిజీగా ఉన్నారు. పంటలు వేసుకునేందుకు యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులతో పాటు విత్తనాలు కొనుగోలు చేసి సిద్ధంగా ఉన్నారు. రెండు రోజుల క్రితం తొలకరి వర్షానికి అక్కడక్కడ రైతులు కూలీలతో విత్తనాలు నాటారు. వరుసగా వర్షాలు కురిస్తే విత్తనాలు వేయడానికి ఇబ్బందిగా ఉంటుందని దుక్కులు దున్ని విత్తనాలు వేయిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 2024, 2025 సంవత్సరాలతో చూస్తే ఈ సంవత్సరం అధికంగా పంటలు వేసుకునేందుకు రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వారి రిజిస్ట్రేషన్ల ఆధారంగానే వ్యవసాయ యాప్‌లో ఎరువులను బుకింగ్ చేసుకుంటే రైతులకు వ్యవసాయ శాఖ సప్లై చేస్తుంది. అందుకు అనుగుణంగానే ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. వికారాబాద్ జిల్లాలో 2024 సంవత్సరంలో 5,51,559 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, 2025 సంవత్సరంలో 5,78,765 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. 2026 సంవత్సరంలో 5,89,100 ఎకరాలలో పంటలు సాగు చేసేందుకు రైతులు వారి వారి వివరాలను రిజిస్ట్రేషన్ వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేయించుకున్నారు.

2026 సంవత్సరానికి రిజిస్ట్రేషన్లు..

వరి 1,42,000, పత్తి 2,92,000, కందులు 98,000, మొక్కజొన్న 35,000, పెసర్లు 10,500, సోయాబీన్ 2,260, జొన్నలు 1,260, మినుములు 4,000 ఎకరాల్లో ఇతర పంటలు 4,080 ఎకరాల్లో సాగు చేసేందుకు వివరాలను నమోదు చేసుకున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సాగుకు 16,186 మెట్రిక్ టన్నుల డీఏపీ, 28,775 మెట్రిక్ టన్నుల యూరియా, 28, 907 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉంచడం జరిగిందని వ్యవసాయ అధికారులు తెలిపారు.

సరిపడా ఎరువులు, విత్తనాలు.. జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం

ఇప్పటికే 3,696 మంది రైతులు ఎరువుల కోసం యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్నారని, వారికి 10,429 ఎరువుల బ్యాగులు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచామని, ఆందోళన చెందకుండా కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. యూరియా, డీఏపీ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే అందజేస్తామని తెలిపారు.

Next Story