మధ్య అమెరికాలో భారీ కాల్పులు.. 16 మంది మృతి

by Muthe.Rajitha |

మధ్య అమెరికాలో జరిగిన భారీ కాల్పుల్లో 16 మంది మృతి చెందినట్టు సమాచారం.

మధ్య అమెరికాలో భారీ కాల్పులు.. 16 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్య అమెరికాలో జరిగిన భారీ కాల్పుల్లో 16 మంది మృతి చెందినట్టు సమాచారం. అక్కడి హోండూరస్‌లో దుండగులు రెండు వేర్వేరు చోట్ల జరిపిన ఘోర కాల్పుల్లో మొత్తం 16 మంది దాకా మరణించారు. మృతుల్లో ఆరుగురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. దశాబ్దాలుగా నడుస్తున్న భూవివాదాలు, స్థానిక గ్యాంగ్‌ల ఆధిపత్య పోరు కారణంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

మొదటి ఘటన ఉత్తర హోండూరస్‌లోని ట్రుజిల్లో మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఒక తోటలో పనిచేస్తున్న కార్మికులపై సాయుధులైన దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 10 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములపై దశాబ్దాలుగా వివాదాలు నడుస్తున్నాయని, ఆ కక్షల నేపథ్యంలోనే ఈ ఊచకోత జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

మరో ఘటనలో, గ్వాటెమాలా దేశ సరిహద్దు ప్రాంతంలో ప్రయాణిస్తున్న పోలీస్‌ కాన్వాయ్‌పై సాయుధ గ్యాంగ్ ఆకస్మికంగా దాడి చేసింది. ఈ కాల్పుల్లో ఆరుగురు పోలీసు అధికారులు మరణించారు. చనిపోయిన వీరంతా స్థానిక క్రిమినల్ గ్యాంగ్‌లకు వ్యతిరేకంగా ప్రత్యేక మిషన్ (ఆపరేషన్) నిర్వహిస్తున్న పోలీసులని ఉన్నతాధికారులు వెల్లడించారు. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ రెండు ఘోర ఘటనలపై హోండూరస్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

Next Story