- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గచ్చిబౌలిలో హాలిడే ప్యాకేజీల పేరిట భారీ మోసం
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో హాలిడే మెంబర్‌షిప్‌లు, టూర్ ప్యాకేజీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో హాలిడే మెంబర్‌షిప్‌లు, టూర్ ప్యాకేజీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ది పసిఫిక్ హాలిడే వరల్డ్" 4R Seasons Holidays Private Limited, న్యూఢిల్లీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థకు చెందిన 15 మంది హాలిడే కన్సల్టెంట్లు, నిర్వాహకులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. డీసీపీ ఉదయ్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ సంస్థ మార్కెటింగ్ సిబ్బంది హైదరాబాద్‌తో పాటు పలుప్రధాన నగరాల్లోని షాపింగ్ మాల్స్, కమర్షియల్ సెంటర్లలో ప్రజలకు ఉచిత కూపన్లు, గిఫ్ట్ వోచర్లు ఇస్తామని చెప్పి వారి మొబైల్ నంబర్లను సేకరించేవారు. అనంతరం బాధితులకు ఫోన్ చేసి గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ వంటి స్టార్ హోటళ్లకు ఆహ్వానించి హాలిడే మెంబర్‌షిప్‌ల పై ఆకర్షణీయమైన ఆఫర్లు చూపించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
సంస్థ ప్రతినిధులు రూ.1.25 లక్షలు చెల్లిస్తే ఐదేళ్ల పాటు ప్రతి సంవత్సరం దేశంలో ఎక్కడైనా ఏడు రాత్రులు ఉచిత బస, అలాగే 10 సంవత్సరాల మెంబర్‌షిప్ తీసుకుంటే దేశీయ, విదేశీ పర్యటనల్లో కూడా ఏడు రాత్రుల బస కల్పిస్తామని హామీలు ఇచ్చి వినియోగదారులను ఆకర్షించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆఫర్లు, డిస్కౌంట్లు, బహుమతుల పేరుతో వినియోగదారులను ఆకర్షిస్తారు. ఈ వ్యవహారం పై జూలై 24న వుట్టూరి స్వరాజ్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ ప్రతినిధుల మాటలను నమ్మి జూలై 16న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.3.40 లక్షలు చెల్లించినప్పటికీ, వాగ్దానం చేసిన ప్రయోజనాలు కల్పించలేదని, తర్వాత తాను ఫోన్ చేస్తే స్పందించడం లేదని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇదే సంస్థ మరికొంత మందిని కూడా ఇదే తరహాలో మోసం చేసినట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు 4R Seasons Holidays Private Limited సంస్థకు చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, హాలిడే కన్సల్టెంట్లుగా పనిచేస్తూ గచ్చిబౌలిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు.
19 మంది నిందితులు అరెస్ట్..
ఇప్పటివరకు 19 మంది బాధితులను గుర్తించగా, వారి నుంచి సుమారు రూ.22 లక్షలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. బాధితుల ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయాలని డీసీపీ కోరారు. అదుపులోకి తీసుకున్న వారిలో మొహమ్మద్ ఆఖిఫ్, శివమ్ శర్మ, షాను కుమార్, సంతోష్ కుమార్, పీయూష్, జయ్ సింగాల్, అపర్ణా చౌహాన్, శుభమ్ శుక్లా, మోహిత్ చౌహాన్, హిమాన్షి నిగమ్, అనక్ అగర్వాల్, ఆయుష్ బాజ్‌పాయ్, అమిత్, ప్రణవ్ పాండే, ప్రశాంత్ కుమార్ కరణ్ ఉన్నారు. వీరంతా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. హాలిడే మెంబర్‌షిప్‌లు, టూర్ ప్యాకేజీల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లు, స్టార్ హోటళ్లలో నిర్వహించే ప్రమోషనల్ కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.






