రెండు గిడ్డంగుల్లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది సజీవ దహనం

by Malleboina Mahesh |

రెండు గిడ్డంగుల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని 8 మంది సజీవ దహనం అయ్యారు. ఈ షాకింగ్ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లా, నజీరాబాద్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

రెండు గిడ్డంగుల్లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది సజీవ దహనం
X

దిశ, వెబ్ డెస్క్: రెండు గిడ్డంగుల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఎనిమిది మంది సజీవ దహనం (Eight people burned alive) అయ్యారు. ఈ షాకింగ్ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లా, నజీరాబాద్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కాగా ఈ భారీ అగ్నిప్రమాదం పెను విషాదాన్ని నింపింది. మొదట మామూలుగా చెలరేగిన మంటలు.. పక్కపక్కనే ఉన్న రెండు గిడ్డంగుల(ఒకటి ప్రముఖ మోమో తయారీ కేంద్రం, మరొకటి డెకరేటర్ గిడ్డంగి)లకు పాకాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ నిద్రిస్తున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ దహనమయ్యారు.

మంటలు దాదాపు 24 గంటల తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో రగులుతూనే ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీసిన అధికారులు, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో వాటి గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. లోపల గాలి వెళ్లే మార్గం లేకపోవడం, ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉండటంతో కార్మికులు బయటకు రాలేకపోయారని తెలుస్తోంది.

కొనసాగుతున్న గాలింపు చర్యలు.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ప్రమాదం జరిగిన సమయంలో గిడ్డంగుల లోపల సుమారు 20 మందికి పైగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 16 మంది గల్లంతైనట్లు ఫిర్యాదులు అందటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సుమారు 12 అగ్నిమాపక యంత్రాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, శిథిలాల నుంచి ఇంకా దట్టమైన పొగ వస్తుంది.

ఈ కారణంగా సహాయక బృందాలు లోపలికి వెళ్లడం కష్టతరమవడంతో కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ బృందాలు గోడలను పగలగొట్టి పొగను బయటకు పంపుతున్నాయి. బాధితులంతా పూర్బా మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాలకు చెందిన వలస కార్మికులు గా గుర్తించారు. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించగా, అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story