TG: రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. ఆఫీసుల్లోనే మ్యారేజ్ హాల్స్

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రజలకు వేగవంతంగా, పార‌ద‌ర్శకంగా అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో స‌మూల మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అన్నారు.

TG: రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. ఆఫీసుల్లోనే మ్యారేజ్ హాల్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజలకు వేగవంతంగా, పార‌ద‌ర్శకంగా అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో స‌మూల మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అన్నారు. గత ప‌దేళ్లలో స్వార్ధపూరిత నిర్ణయాల వల్ల రెవెన్యూ వ్యవ‌స్థ పూర్తిగా భ్రష్టు ప‌ట్టిపోయింద‌ని విమ‌ర్శించారు. గ‌డ‌చిన రెండేండ్లుగా సీఎం రేవంత్ రెడ్డి స‌ల‌హాలు, సూచ‌న‌ల మేర‌కు వ్యవ‌సస్థను సంస్కరిస్తూ రెవెన్యూ సేవ‌ల‌ను ప్రజ‌ల‌కు చేరువ చేస్తున్నామ‌న్నారు. ఇంటిగ్రేటెడ్ కార్యాల‌యాల ఏర్పాటుపై మంగ‌ళ‌వారం సచివాల‌యంలో అధికారుల‌తో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌రిధిలో 39 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను 11 క్లష్టర్‌లుగా విభ‌జించి, ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక‌భారం ప‌డ‌కుండా ప్రైవేటు నిర్మాణ రంగ సంస్ధల‌తో నిర్మిస్తున్నామ‌న్నారు. నిర్మాణంతో పాటు ఐదు సంవ‌త్సరాల నిర్వహణా బాధ్యత‌ను కూడా ఆ సంస్థలే తీసుకున్నాయ‌ని తెలిపారు. మూడు నుంచి ఐదు ఎక‌రాల స్థలంలో కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. వివాహ రిజిస్ట్రేష‌న్ల కోసం మినీ మ్యారేజీ హాల్‌, గ‌ర్బిణీల‌కు, వృద్దుల‌కు ప్రత్యేక వ‌స‌తులు, విశాల‌మైన వెయిటింగ్ ఏరియా మ‌హిళ‌ల కోసం ఫీడింగ్ రూమ్‌, చిన్న పిల్లల కోసం క్రెచ్‌, వృద్దులు, దివ్యాంగుల కోసం ఆధునిక లిఫ్ట్ సౌక‌ర్యం త‌దిత‌రాల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే సంస్కరణలు

త్వర‌లో మిగిలిన కార్యాల‌యాల‌కు శంకుస్ధాప‌న‌ల‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రెండో విడ‌త‌లో జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ భ‌వ‌నాల‌ను నిర్మిస్తామ‌ని ఇందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను సిద్దం చేయాల‌ని సూచించారు. ఇప్పటికే తాలిమ్‌లో ఇంటిగ్రేటెడ్ భ‌వ‌న నిర్మాణ ప‌నులు ముమ్మరంగా సాగుతున్నాయ‌ని, జూన్ 2వ తేదీ నాటికి ప్రజ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావ‌డానికి ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఇటీవ‌ల మేడ్చల్ జిల్లాలో భ‌వ‌నానికి శంకుస్ధాప‌న చేశామన్నారు. బుధవారం ప‌టాన్ చెరువు- శంకర‌ప‌ల్లి ప్రధాన ర‌హ‌దారి స‌మీపంలో రాజ‌పుష్ప క‌న‌స్ట్రక్షన్ నిర్మించే ఇంటిగ్రేటెడ్ భ‌వ‌నానికి శంకుస్ధాప‌న చేయ‌నున్నట్లు తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో స్లాట్ బుకింగ్, ఈ ఆధార్ సంత‌కం వంటి సౌక‌ర్యాల‌తో ప్రజ‌ల స‌మ‌యాన్ని ఎంతో ఆదా చేశామ‌న్నారు. రెవెన్యూ శాఖలో తీసుకుంటున్న ఈ సంస్కరణలు కేవలం కార్యాలయాల మార్పు మాత్రమే కాకుండా, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే సంస్కరణలుగా నిలుస్తాయని పొంగులేటి స్పష్టం చేశారు.

జ‌ర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత

రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవాన్ని కాపాడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌కు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత్రికేయుల అక్రిడిటేషన్ అంశంపై అన్ని పాత్రికేయ సంఘాల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని గ‌తంలో విడుద‌ల చేసిన జీవోలో మార్పులు చేర్పులు చేసి కొత్త జీవోను జారీ చేశామ‌ని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని అన్నారు. మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో ప‌లు జ‌ర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రికి కృత‌జ్ఞత‌లు తెలిపారు. త‌మ‌ ప్రభుత్వం ఎలాంటి భేష‌జాల‌కు పోకుండా అంద‌రికి న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటుంద‌న్నారు.




Next Story