- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పందిట్లోనే వధువుపై అరిచిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
ఊరేగింపులో తలెత్తిన ఒక చిన్న వివాదం పెద్దదై, చివరకు పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయేలా చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : కాసేపట్లో వివాహం.. ఇరు కుటుంబాల్లో పెళ్లి బాజాల సందడి, బంధువుల కేరింతల నడుమ వధూవరుల ఊరేగింపు ఘనంగా సాగుతోంది. అంతలోనే ఊరేగింపులో తలెత్తిన ఒక చిన్న వివాదం పెద్దదై, చివరకు పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయేలా చేసింది. వరుడు అందరి ముందూ వధువుపై అరవడంతో ఆగ్రహించిన వధువు తండ్రి, ఆ క్షణంలోనే పెళ్లిని క్యాన్సిల్ చేసి కూతురిని ఇంటికి తీసుకెళ్లిపోయిన వింత ఉదంతం ఏపీలోని మార్కాపురం జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.
డ్యాన్స్ గొడవతో మారిన సీన్
మార్కాపురం రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన యువకుడికి, కంభం మండలం తురిమెళ్లకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. ఆదివారం ఉదయం ముహూర్తం ఉండటంతో శనివారం రాత్రే వధువు కుటుంబం పెళ్లి గ్రామానికి చేరుకుంది. రాత్రి వేళ వధూవరులను వాహనం ఎక్కించి బారాత్ మొదలుపెట్టారు. స్థానిక యువకులు, బంధువులు డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న సమయంలో, వధూవరులను కూడా డ్యాన్స్ చేయాలని కొందరు కోరారు. అందుకు అమ్మాయి ఉత్సాహంగా సిద్ధపడగా, అబ్బాయి మాత్రం తాను డ్యాన్స్ చేయనని తెగేసి చెప్పాడు. అంతటితో ఆగకుండా అందరి ముందూ, “నువ్వు కూడా డ్యాన్స్ చేయడానికి వీల్లేదు” అంటూ వధువుపై గట్టిగా అరుస్తూ, మందలించాడు.
పెళ్లీ వద్దు.. గిళ్లీ వద్దు
పెళ్లి కాకముందే, అందరి సమక్షంలో కాబోయే అల్లుడు తన కుమార్తెపై అలా అరుస్తూ అధికారం చలాయించడం వధువు తండ్రికి అస్సలు నచ్చలేదు. పెళ్లికి ముందే ఇంత అహంకారంతో ఉంటే, పెళ్లయ్యాక తన కూతురిని ఇంకెంత ఇబ్బంది పెడతాడోనని ఆయన ఆలోచనలో పడ్డారు. వెంటనే తీవ్ర నిర్ణయం తీసుకున్న వధువు తండ్రి.. ఊరేగింపు వాహనం పైనుంచి తన కుమార్తెను కిందికి దించేశారు. “మాకు ఈ పెళ్లీ వద్దు.. గిళ్లీ వద్దు” అని తేల్చిచెబుతూ, బంధువులందరినీ తీసుకొని రాత్రికి రాత్రే సొంతూరికి తిరుగుపయనమయ్యారు.
లబోదిబోమంటున్న వరుడి కుటుంబం
క్షణాల వ్యవధిలో పెళ్లి వేడుక కాస్తా రద్దవడంతో ఇరువైపులా తీవ్ర గందరగోళం నెలకొంది. చివరకు పెద్దమనుషుల సమక్షంలో ఇరువర్గాలు కూర్చొని కట్నకానుకల లావాదేవీలను అక్కడికక్కడే సెటిల్ చేసుకున్నారు. అయితే పెళ్లి కోసం అప్పటికే భారీగా ఏర్పాట్లు చేసి, లక్షల రూపాయలు ఖర్చు చేసిన వరుడి తరఫు వారు.. వరుడి తొందరపాటు ప్రవర్తన వల్ల పెళ్లి ఆగిపోయిందని, చేతిలో డబ్బులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని లబోదిబోమంటున్నారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






