యుద్ధ భయం తో కుప్పకూలిన మార్కెట్లు.. సెన్సెక్స్ 1700, నిఫ్టీ 500 పాయింట్లు పతనం

by Malleboina Mahesh |   (  Updated:2026-03-04 05:55:03  IST  )

యుద్ధ భయంతో కుప్పకూలిన మార్కెట్లు; సెన్సెక్స్ 1700, నిఫ్టీ 500 పాయింట్లు పతనం. రూపాయి విలువ రికార్డు స్థాయిలో 92.17కి క్షీణత. లక్షల కోట్లు ఆవిరి.

యుద్ధ భయం తో కుప్పకూలిన మార్కెట్లు.. సెన్సెక్స్ 1700, నిఫ్టీ 500 పాయింట్లు పతనం
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు. ఇరాన్ పై చేసిన సంయుక్త దాడి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. నేరుగా అమెరికాపై దాడి చేయలేని ఇరాన్.. అరబ్ కంట్రీస్ లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది. దీంతో యుద్ధ భయంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామం స్టాక్ మార్కేట్లపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. దీంతో అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి.

బుధవారం ట్రేడింగ్‌లో దలాల్ స్ట్రీట్ చరిత్రలో నిలిచిపోయే భారీ పతనాన్ని చవిచూసింది. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడం, దక్షిణ ఇరాన్‌లోని బూషెహర్ ఎయిర్‌పోర్ట్‌పై జరిగిన దాడుల వార్తలతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు. ఫలితంగా సెన్సెక్స్ ఏకంగా 1,700 పాయింట్లు కుప్పకూలగా, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా క్షీణించి కీలక మద్దతు స్థాయిల దిగువకు పడిపోయింది. ఈ ఒక్క రోజు పతనంతో ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

భారత రూపాయి విలువ పతనం

ఈ యుద్ధం కారణంగా కేవలం స్టాక్ మార్కెట్లే కాకుండా భారత రూపాయి విలువ కూడా రికార్డు స్థాయిలో పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలతో డాలర్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఫలితంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఒక్క రోజే 67 పైసలు క్షీణించి 92.17 వద్ద ఆల్‌టైమ్ లోకి చేరుకుంది. రూపాయి ఇంత భారీగా పతనం కావడం భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ భారీ పతనానికి ప్రధానంగా ఇరాన్ అగ్రనేత ఖమేనీ మరణం తర్వాత పరిణామాలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు సెగ తోడయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకోవడంతో బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. యుద్ధం గనుక మరికొన్ని రోజులు కొనసాగితే మార్కెట్లు మరింతగా కుంగిపోయే ప్రమాదం ఉందని, ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగు వేయాలని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Next Story