పాకిస్తాన్‌లో డీఎస్పీగా తొలి హిందూ మహిళ.. చరిత్ర సృష్టించిన మనీషా

by Disha Web Desk 7 |
పాకిస్తాన్‌లో డీఎస్పీగా తొలి హిందూ మహిళ.. చరిత్ర సృష్టించిన మనీషా
X

దిశ, ఫీచర్స్ : దాయాది దేశం పాకిస్తాన్‌లో 26 ఏళ్ల హిందూ యువతి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌(DSP)గా నియమించబడి చరిత్ర సృష్టించింది. సింధ్ ప్రావిన్స్‌, జాకోబాబాద్‌లో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనీషా రొపేటా.. గతేడాది సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన 152 మంది అభ్యర్థుల్లో 16వ స్థానంలో నిలిచింది. అయితే పురుషాధిక్యత ప్రబలంగా ఉన్న పాకిస్తాన్‌ వంటి దేశంలో ఆమె సీనియర్ అధికారి స్థాయికి చేరుకోవడం చారిత్రాత్మకమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక పాకిస్తాన్‌లో జరిగే నేరాల్లో మహిళలే ఎక్కువగా అణచివేతకు గురవుతున్నారని అభిప్రాయపడ్డ మనీషా.. తాను సీనియర్ పోలీస్ అధికారిగా పనిచేస్తుండటం నిజంగా మహిళలకు సాధికారిత కల్పించడమేనని భావిస్తోంది.

'నేను ఫెమినైజేషన్ డ్రైవ్‌కు నాయకత్వం వహించి పోలీస్ దళంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. ఇక పోలీస్‌ డ్యూటీ పట్ల నేనెప్పుడూ స్ఫూర్తి పొందుతాను' అని మనీషా చెప్పుకొచ్చింది. ఆమె 16 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో.. తల్లి ఒక్కతే ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పాటు వారి తమ్ముడి చదువు బాధ్యతలను మోసింది. ఈ ముగ్గురు సిస్టర్స్ డాక్టర్లే కాగా తమ్ముడు మెడిసిన్ చదువుతున్నాడు. అయితే మనీషా పోలీస్ శాఖలో చేరినప్పుడు తన స్వగ్రామంలోని ప్రజలు తమకు మద్దతివ్వలేదు. చాలామంది తను ఈ డిపార్ట్‌మెంట్‌లో ఎక్కువ కాలం ఉండదని చెప్పారు. అయితే అవన్నీ తప్పని నిరూపించింది మనీషా.



Next Story