- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల నిర్వహణ
రాష్ట్రంలోని జూ పార్కులకి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను తెలంగాణ జూ పార్క్స్ అథారిటీ ఆమోదించినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని జూ పార్కుల అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణ, సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను తెలంగాణ జూ పార్క్స్ అథారిటీ ఆమోదించినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన తెలంగాణ జూ పార్క్స్ అథారిటీ 15వ సమావేశంలో రాష్ట్రంలోని జూ పార్కుల అభివృద్ధి పనులు, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు, మౌలిక వసతుల విస్తరణ, సందర్శకుల సేవల మెరుగుదలపై అటవీ అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర జూ పార్కులను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. జంతు సంక్షేమం, శుభ్రత, పచ్చదనం, భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థుల్లో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
జూ పార్కుల్లో డిజిటల్ సదుపాయాలు, సందర్శకులకు గైడెన్స్ వ్యవస్థలు, తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, పారిశుధ్య సౌకర్యాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. వన్యప్రాణుల ఆరోగ్య పరిరక్షణకు ఆధునిక వెటర్నరీ సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో అధికారులు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ వివరాలను సమర్పించగా, వాటిని జూ పార్క్స్ అథారిటీ ఆమోదించింది. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, అటవీ దళాల అధిపతి డాక్టర్ సీ.సువర్ణ, వైల్డ్ లైఫ్ చీఫ్ వినయ్ కుమార్, సీనియర్ అటవీ అధికారి రత్నాకర్ జౌహారీ, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, భీమా నాయక్, జూ డైరెక్టర్ సునీల్ హీరామత్ ఇతర ఉన్నతాధికారులు, జూ పార్కుల అధికారులు పాల్గొన్నారు.






