మందుల చీటీ తారుమారు.. హై డోస్ మెడిసిన్స్‌ వేసుకుని వ్యక్తి మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-21 13:19:56  IST  )

ఒకే పేరుతో ఉన్న ఇద్దరు రోగుల మందుల చీటి తారుమారు కావడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

మందుల చీటీ తారుమారు.. హై డోస్ మెడిసిన్స్‌ వేసుకుని వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకే పేరుతో ఉన్న ఇద్దరు రోగుల మందుల చీటీ తారుమారు కావడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వైద్యులు, సిబ్బంది చేసిన చిన్న పొరపాటు ఓ కుటుంబంలో చికటి నింపింది. వివరాల్లోకి వెళితే.. దోమకొండ (Domakonda) మండల పరిధిలోని అంచనూరు (Anchanuru) గ్రామానికి చెందిన నాగ బాలరాజు (73) అనే వృద్ధుడు నరాల సమస్య, థైరాయిడ్ చికిత్స కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఆసుపత్రికి వెళ్లారు. అదే సమయంలో అదే పేరుతో ఉన్న మరో వ్యక్తి డయాబెటిక్ పేషెంట్ కూడా అదే ఆసుపత్రికి వచ్చాడు. పేరు పిలిచినప్పుడు పొరపాటున నాగ బాలరాజు డాక్టర్ గదిలోకి వెళ్లగా.. వైద్యుడు వివరాలు సరి చూసుకోకుండా డయాబెటిక్ పేషెంట్‌కు ఇవ్వాల్సిన హై-డోస్ షుగర్ మందులను బాలరాజుకు రాసిచ్చారు. అయితే, వైద్యుడు రాసిచ్చిన మందులను వాడిన కొద్దిసేపటికే నాగ బాలరాజు ఆరోగ్యం క్షీణించింది. శరీరంలో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పడిపోవడంతో ఆయన స్పృహ కోల్పోయారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మళ్లీ అదే ఆసుపత్రికి తీసుకువెళ్లగా, కేస్ షీట్ మారిపోయిందని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగ బాలరాజు మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు.

ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడిపై కేసు నమోదు..

బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడితో పాటు ఇద్దరు కాంపౌండర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే పేరు ఉన్నప్పుడు వయస్సు లేదా ఇతర వివరాలు సరిచూసుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story