- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ హైడ్రామా... స్ట్రాంగ్‌రూమ్ వద్ద మమతా అర్ధరాత్రి ధర్నా
ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయంటూ మమతా బెనర్జీ రంగంలోకి దిగి అర్ధరాత్రి వరకు ధర్నా నిర్వహించడం చర్చనీయాంశమైంది.

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. గురువారం రాత్రి కోల్‌కతాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి అర్ధరాత్రి వరకు ధర్నా నిర్వహించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. నేతాజీ ఇండోర్ స్టేడియం సమీపంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద టీఎంసీ నేతలు కునాల్ ఘోష్, శశి పంజాలతో కలిసి మమతా బెనర్జీ నిరసనకు దిగారు. తన సొంత నియోజకవర్గమైన భబానీపూర్‌లోని మరో స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా రాత్రి 8:15 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆమె పర్యవేక్షించారు.
ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కై, పోస్టల్ బ్యాలెట్ బాక్సులను, ఈవీఎంలను అనధికారికంగా తెరిచి ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ (TMC) తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన కొన్ని సీసీటీవీ విజువల్స్ కూడా బయటికి వచ్చాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే తాము రోడ్లపైకి వచ్చామని దీదీ ఈ సందర్భంగా ప్రకటించారు.
టీఎంసీ ఆరోపణలను ఎన్నికల సంఘం (EC) తీవ్రంగా ఖండించింది. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద అన్ని ప్రక్రియలు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే పారదర్శకంగా జరుగుతున్నాయని, అక్రమాలకు తావులేదని స్పష్టం చేసింది. మరోవైపు బీజేపీ నేతలు సైతం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్దకు చేరుకుని మమతా బెనర్జీ తీరును విమర్శించారు. ఓటమి భయం వల్లే మమతా బెనర్జీ ఇటువంటి డ్రామాలకు తెరలేపారని, ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించలేక ఎన్నికల ప్రక్రియపై బురద జల్లుతున్నారని బీజేపీ మండిపడింది.
ప్రస్తుతం కోల్‌కతాలోని స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భారీగా పోలీసు బలగాలు మరియు కేంద్ర బలగాలను మోహరించారు. ఫలితాల ప్రకటనకు ముందే అధికార, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. మే మొదటి వారంలో వెలువడనున్న ఫలితాల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో వేచి చూడాలి.






