ఓట్ల లెక్కింపు వేళ కార్యకర్తలకు మమతా బెనర్జీ సంచలన పిలుపు!

by Malleboina Mahesh |

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద లోడ్ షెడ్డింగ్ చేస్తూ బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఓట్ల లెక్కింపు వేళ పార్టీ కార్యకర్తలు రాత్రంతా మేల్కొని అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఓట్ల లెక్కింపు వేళ కార్యకర్తలకు మమతా బెనర్జీ సంచలన పిలుపు!
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్న తరుణంలో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తన పార్టీ కార్యకర్తలకు సంచలన పిలుపు ఇచ్చారు. హుగ్లీలోని సెరాంపూర్, నదియాలోని కృష్ణానగర్, బర్ద్వాన్‌లోని ఔస్‌గ్రామ్, కోల్‌కతాలోని క్షుదీరామ్ అనుశీలన్ కేంద్రం వంటి పలు ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా లోడ్ షెడ్డింగ్ (విద్యుత్ కోత) విధిస్తున్నారని నివేదికలు అందుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. లోడ్ షెడ్డింగ్ చేస్తున్న సమయంలో సీసీటీవీలను నిలిపివేసి, స్ట్రాంగ్ రూమ్‌ల లోపలికి వాహనాలు వెళ్లడం, బయటకు రావడం వంటి అనుమానాస్పద ఘటనలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.

బీజేపీ ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతోందని మమతా బెనర్జీ విమర్శించారు. తానే స్వయంగా రాత్రంతా మేల్కొని అన్ని అంశాలను పర్యవేక్షిస్తున్నానని, అదే విధంగా పార్టీ కార్యకర్తలు కూడా రాత్రంతా మేల్కొని స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ప్రజల ఓట్లను కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే అధికారులను చుట్టుముట్టాలని, ఫిర్యాదులు చేయాలని, సీసీటీవీ ఫుటేజీని డిమాండ్ చేయాలని ఆమె సూచించారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. అలాగే 1000 నుంచి 2000 లోపు మెజార్టీతో ఓడిపోతే కచ్చితంగా రీ కౌంటింగ్ పట్టుబట్టాలని కార్యకర్తలకు, ఏజెంట్లకు నిన్నటి మీటింగ్ లో మమతా బెనర్జీ దిశానిర్దేశం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Next Story