- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీల ధీమా
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియగా, ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై పడింది. ఈ నేపథ్యంలో విజయంపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియగా, ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై పడింది. ఈ నేపథ్యంలో విజయంపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్లలో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు వందకు పైగా మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తామని హస్తం లీడర్లు లెక్కలు వేసుకుంటున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చామని చెప్తున్న బీఆర్ఎస్.. కనీసం 30 చోట్ల గులాబీ జెండా ఎగురవేస్తామని భావిస్తున్నది. ఈసారి ఉత్తర తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలం పార్టీ రెండు నగరపాలక సంస్థలతో పాటు 15 పురపాలక సంస్థలను సొంతం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నది.
అధికార కాంగ్రెస్‌లో జోష్..
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. మెజారిటీ వార్డులు, డివిజన్లలో త్రిముఖ పోటీ కనిపించింది. ఇందులో మెజారిటీ ఓట్లు తమకే వచ్చాయని కాంగ్రెస్ చెబుతున్నది. పోలింగ్ ముగిసిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఏరియాల్లో జరిగిన ఓటింగ్ సరళిపై ఆరా తీశారు. వార్డుల వారీగా లెక్కలు తీసి.. మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తున్నామనే నిర్ణయానికి వచ్చారు. వంద మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో విజయం సాధిస్తామని వారు భరోసా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్‌కు పట్టున్న జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో సైతం కాంగ్రెస్ జెండా ఎగరేవేస్తామని చెబుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని పట్టణాలు సైతం తమ ఖాతాలో చేరుతాయని ధీమాగా ఉన్నారు.
ఓటింగ్ శాతంపై బీఆర్ఎస్ ఫోకస్
మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులు దక్కించుకోవడం కంటే ఓటింగ్ శాతం పెంచుకోవడంపైనే ఈసారి బీఆర్ఎస్ ఫోకస్ పెట్టినట్లు కనిపించింది. అందులో భాగంగా ఏకగ్రీవాలు కాకుండా తమ పార్టీకి చెందిన బలమైన అభ్యర్థులను బరిలోకి దించింది. దీంతో మెజార్టీ పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బలమైన పోటీ ఇచ్చారు. కొందరైతే అధికార పార్టీకి దీటుగా పోల్ మేనేజ్‌మెంట్ చేశారు. దీంతో దాదాపు 30 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ లీడర్లు అంచనా వేస్తున్నారు.
కొత్త ఊపులో బీజేపీ..
మున్సిపల్ ఎన్నికలను ఈసారి బీజేపీ సీరియస్‌గా తీసుకున్నది. ఉత్తర తెలంగాణలో మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండటంతో ఆ ఏరియాల్లోని మున్సిపాలిటీలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమానంగా ప్రచార తీరు, పోల్ మేనేజ్‌మెంట్ వ్యూహాలను అమలు చేసింది. దీంతో నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మేయర్ పదవిని సొంతం చేసుకునేందుకు కావాల్సిన మెజార్టీ వస్తుందనే ధీమా ఆ పార్టీ కేడర్‌లో కనిపిస్తున్నది. అలాగే, ఉత్తర తెలంగాణలోని 15 మున్సిపాలిటీల చైర్మన్ పదవులను సొంతం చేసుకుంటామని కమలం నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.






