నాచారంలో భారీ అగ్ని ప్రమాదం

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామిక ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

నాచారంలో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామిక ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాబా ఫంక్షన్ హాల్‌కు సమీపంలో ఉన్న డ్యూరోఫ్లెక్స్ మెట్రెస్ తయారీ యూనిట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. ఫ్యాక్టరీలో పరుపుల తయారీకి ఉపయోగించే ఫోమ్, ఇతర రసాయనాలు ఉండటంతో మంటలు క్షణాల్లోనే భవనం అంతటా వ్యాపించాయి. మంటల తీవ్రతకు భవనం నుంచి భారీగా నిప్పు రవ్వలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు మొదలైనట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, హైదరాబాద్ ఫైర్ సర్వీసెస్ బృందాలు పలు ఫైర్ టెండర్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

మంటలను అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. అయితే, ఫ్యాక్టరీలోని యంత్రాలు, నిల్వ ఉంచిన భారీ స్టాక్ పూర్తిగా దగ్ధమవ్వడంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోగా.. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.

Next Story