UPSC పరీక్షల్లో భారీ మార్పులు

by Muthe.Rajitha |

సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఈసారి భారీ మార్పులు చేసినట్టు సమాచారం.

UPSC పరీక్షల్లో భారీ మార్పులు
X

దిశ, వెబ్ డెస్క్ : సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఈసారి భారీ మార్పులు చేసినట్టు సమాచారం. UPSC పరీక్షల్లో ఎలాంటి మోసాలు జరగకుండా, ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ... కొత్త నియమాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా AI ఆధారిత ఫేసియల్ రికగ్నైజేషన్ విధానాన్ని తప్పనిసరి చేసింది. ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయడాన్ని ఈ విధానంలో పూర్తిగా అడ్డుకోనున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో NDA, CDS పరీక్షల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అప్పుడు ఒక్కో అభ్యర్థి వెరిఫికేషన్‌కు కేవలం 8 నుంచి 10 సెకన్లు మాత్రమే పట్టింది. ఈ ప్రక్రియ చాలా త్వరగా, సురక్షితంగా జరిగింది.

అందుకే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్ష సహా అన్ని యూపీఎస్సీ పరీక్షలకు ఈ నియమం అమలు చేస్తున్నారు. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఇప్పటికే ఒకసారి ఎంపికైన అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాలనుకుంటే కఠిన నిబంధనలు వచ్చాయి. ఉదాహరణకు IAS లేదా IFSలో జాయిన్ అయిన వాళ్లు మళ్లీ పరీక్ష రాయాలంటే ఆ సర్వీస్ కు రాజీనామా చేయాలి. లేకపోతే అర్హత ఉండదు. IPS లాంటి సర్వీసుల్లో ఉన్నవాళ్లకు ఒక్కసారి మాత్రమే మెరుగైన ర్యాంక్ కోసం అవకాశం ఇస్తారు. సర్వీస్ అలాకేషన్‌లో స్పష్టత, ఎంపిక ప్రక్రియలో ఎలాంటి మోసాలకు తావు లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం కోసం ఈ కొత్త నియమాలను ప్రవేశ పెడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

గురువారం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ లో పొందుపరిచారు. మొత్తం 933 పోస్టులకు గాను సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఈ ఏడాది మే 24న దేశవ్యాప్తంగా జరగనుంది. ఇందుకోసం అభ్యర్థులు ఇటీవలి ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పరీక్షా కేంద్రం లోకి వెళ్లేముందు ఖచ్చితంగా ఫేసియల్ రికగ్నైజేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

Next Story