గ్రామ పంచాయతీలకు మహర్దశ.. 15వ ఆర్థిక సంఘం నిధులకు లైన్ క్లియర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-14 01:55:37  IST  )

కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు శుభవార్త చెప్పింది.

గ్రామ పంచాయతీలకు మహర్దశ.. 15వ ఆర్థిక సంఘం నిధులకు లైన్ క్లియర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికల నూతన సర్పంచ్‌లకు శుభవార్త చెప్పింది. ఇన్నాళ్లూ నిధులు లేక.. చిన్న చిన్న సమస్యలను తీర్చలేక సతమతవుతున్న గ్రామ పంచాయతీలకు నిధుల సమస్యను తీర్చనుంది. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. పంచాయతీలకు రావాల్సిన సుమారు రూ.2500 కోట్ల పెండింగ్ నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరు లోపు కనీసం రూ.వెయ్యి కోట్లను కేంద్రం విడుదల చేయనున్నట్లు తెలిసింది. మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేసేందుకు అంగీకరించిందని తెలుస్తోంది. నిధుల రాగానే వాటిని వినియోగించుకునేందుకు మంత్రి సీతక్క ఆదేశాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ దృష్టిసారించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం అన్ని జిల్లాలకు మెమో జారీచేసింది. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో డిజిటల్ ప్రక్రియను తప్పనిసరి చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతి గ్రామపంచాయతీ ప్రత్యేక బ్యాంకు ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ఖాతాను పీఎఫ్​ఎంఎస్ (Public Financial Management System) పోర్టల్‌లో నమోదు చేసి యూనిక్ ఏజెన్సీ కోడ్ పొందాలి. అదే సమయంలో ఈ గ్రామ్​ స్వరాజ్​ పోర్టల్‌లో కూడా ఆ వివరాలను నమోదు చేయాలి. నిధుల వినియోగానికి మేకర్, చెకర్‌గా వ్యవహరించే వారి డిజిటల్ సంతకాలను ఈ గ్రామ్​ స్వరాజ్‌లో నమోదు చేసి సంబంధిత ఎంపీడీవో ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది.

ఉప సర్పంచ్ కీ రోల్..

గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ మేకర్‌గా, సర్పంచ్ చెకర్‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు క్లాస్-3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు తప్పనిసరి కాగా, సైనింగ్, ఎన్‌క్రిప్షన్ సౌకర్యంతో పాటు యూఎస్​బీ టోకెన్ కూడా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాతే 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుందని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టం చేసింది. అందువల్ల రాష్ట్రంలోని అన్ని జిల్లా పంచాయతీల అధికారులు అవసరమైన డిజిటల్ సంతకాలను జీఈఎం పోర్టల్, ఈ ప్రోక్యూర్‌మెంట్ లేదా ఇతర టెండర్ విధానాల ద్వారా వెంటనే సేకరించి, నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ శృతి ఓజా అన్ని జిల్లాల పంచాయతీల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నిధుల కొరత తీరినట్లే..

రాష్ట్రంలో గతంలో గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు. గతనెలలో ఎన్నికలు పూర్తవడంతో కేంద్రానికి నిధులు విడుదల చేయాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అధికారులు నిరంతర సంప్రదింపులతో నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు, కొత్త పనులు ప్రారంభం కానున్నాయి. కొత్త పాలకవర్గాల ఆధ్వర్యంలో గ్రామ సమస్యలు తీరనున్నాయి.

Next Story