పేదల బియ్యంపై తగ్గని మాఫియా కన్ను

by Ratna Kumari |   (  Updated:2026-07-10 16:29:38  IST  )

జిల్లాలో భారీగా అక్రమ దందాకు గురవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఈ బియ్యం మాఫియా నెట్‌వర్క్ యథేచ్ఛగా విస్తరిస్తోంది.

పేదల బియ్యంపై తగ్గని మాఫియా కన్ను
X

దిశ, కాగజ్ నగర్: జిల్లాలో భారీగా అక్రమ దందాకు గురవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఈ బియ్యం మాఫియా నెట్‌వర్క్ యథేచ్ఛగా విస్తరిస్తోంది. అధికారుల పర్యవేక్షణా లోపం, తనిఖీలలో ఉదాసీనత అక్రమార్కులకు వరంగా మారాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సరఫరా నేపద్యంలో..

కొమరం భీమ్ జిల్లాలోని గల1,63,765 ల రేషన్ కార్డులు15 మండలాలో గల 315 చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు నెలవారీ కోటా కింద సుమారు 3,278.74 మెట్రిక్ టన్నుల బియ్యం విడుదలైంది. ఈ పీడీఎస్ బియ్యం డీలర్ల వద్దకి రావడం అక్రమార్కులకు బంగారు అవకాశంగా మారింది. సరఫరా పూర్తి స్థాయిలో ముగియక ముందే, పరిస్థితులను అంచనా వేసిన ముఠాలు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున నిల్వలు ఉంచి దందాను పెద్దఎత్తున చేస్తున్నారు.

రేషన్ డీలర్లతో కలిసి బడాబాబుల డబుల్ గేమ్..

గ్రామ స్థాయి నుంచి మిల్లులు, గోదాములు, బ్లాక్ మార్కెట్ వరకు విస్తరించిన ఈ గొలుసు దందాలో కొందరు జిల్లాలోని బడా బాబులే, రేషన్ డీలర్ల తో కలిసి అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. వీరు ఒకవైపు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తూనే మరోవైపు లబ్ధిదారుల నుంచి ఆ బియ్యాన్ని తక్కువ ధరకే తిరిగి కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ డబుల్ గేమ్ ఆడుతున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు చేరిన బియ్యం ఎక్కువసేపు నిల్వ ఉండకుండా, రాత్రివేళల్లో రహస్యంగా వాహనాల్లో గోడౌన్లకు తరలిపోతున్నట్లు సమాచారం.

అధికారుల నిర్లక్ష్యంతోనే రవాణ..

ఇటీవల కాలంలో పలుమార్లు పీడీఎస్ బియ్యాన్ని భారీగా పట్టుకున్న ఘటనలు ఉన్నప్పటికీ, అక్రమ రవాణా ఏమాత్రం తగ్గకపోవడం అధికారుల వైఫల్యాన్నే సూచిస్తోంది. గతంలో అక్రమాలకు పాల్పడి సీజ్ అయిన మిల్లులే ఇప్పుడు మళ్లీ రహస్య నిల్వ కేంద్రాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు తనిఖీలు, కఠిన చర్యలు సడలించడంతో ఈ దందా మరింత వ్యవస్థీకృతంగా మారుతోంది. ముఠాలు పెద్ద పెద్ది లాగా అక్రమాలను రెట్టింపు చేసుకునే దిశగా కదులుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. భారీ సరఫరా జరుగుతున్న నేపథ్యంలో పర్యవేక్షణలో చిన్న లోపం జరిగినా అది పెద్ద అక్రమాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం నిద్ర వీడి నిఘా, తనిఖీలు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే పేదల నోటి కూడు పూర్తిగా మాఫియా చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు.

Next Story