ప్రేమ వ్యవహారం.. బంధువుల చేతిలో వ్యక్తి దారుణ హత్య

by Ratna Kumari |

ప్రేమ వ్యవహారం నేపథ్యంలో వ్యక్తి హత్య.. బంధువులపై కేసు నమోదు

ప్రేమ వ్యవహారం.. బంధువుల చేతిలో వ్యక్తి దారుణ హత్య
X

దిశ, రెబ్బెన : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామంలో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో బంధువులే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. రెబ్బెన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపూర్ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన వేమునూరి స్వామి (48) కూలీగా జీవనం సాగిస్తున్నాడు. కాగజ్‌నగర్ మండలం గెర్రగూడ–రాసపల్లి గ్రామపంచాయతీకి చెందిన ఇరిగిరాల తిరుపతి, ఇరిగిరాల వెంకటేష్ అనే అన్నదమ్ముల మేనకోడలు, మృతుడి అన్న కుమారుడి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఈ ప్రేమ వ్యవహారానికి స్వామే కారణమని భావించిన నిందితులు అతనిపై కక్ష పెంచుకున్నారు.

ముందస్తు పథకం ప్రకారం మంగళవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో స్వామిని మాట్లాడాలని చెప్పి గ్రామ శివారుకు పిలిపించారు. అనంతరం వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య వేమునూరి దేవాల, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు రెబ్బెన పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్‌ఐ వెంకటకృష్ణ సందర్శించి పరిశీలించారు. క్లూస్ బృందం సహాయంతో ఆధారాలు సేకరించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story