భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలు.. విచారణకు ఆదేశించిన లోకాయుక్త

by Kema Shiva Kumar |

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భూభారతి పోర్టల్కేం ద్రంగా భారీ అక్రమాలు ఇటీవలే వెలుగు చూసిన విషయం తెలిసిందే.

భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలు.. విచారణకు ఆదేశించిన లోకాయుక్త
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భూభారతి పోర్టల్కేం ద్రంగా భారీ అక్రమాలు ఇటీవలే వెలుగు చూసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలను కేటుగాళ్లు తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. సాంకేతికతను ఆసరాగా చేసుకుని సాఫ్ట్‌వేర్‌లోని లొసుగులను వాడుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్ల మేర గండి కొడుతున్న ముఠాను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాల విషయం తెలుసుకున్న లోకాయుక్త (Lokayukta) జరిగిన స్కామ్‌ తీవ్రంగా పరిగణిస్తూ సమోటోగా నమోదు చేసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్, స్టాంపులు రిజిస్ట్రసన్ల శాఖ కమిషనర్, ఐజీ, మీసేవా కమిషనర్, జనగామ జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ల రిజిస్ట్రార్‌లు సమగ్ర విచారణ చేపట్టాలని లోకాయుక్తా ఆదేశాలు జారీ చేసింది.

ఎడిటింగ్‌తో మాయాజాలం..

భూభారతిలో కుంభకోణం వెనుక ప్రధానంగా ఒక టెక్నికల్ ముఠా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా భూ రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన చలాన్ మొత్తాన్ని ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా పేమెంట్ చేయాలి. అయితే, ఈ కేటుగాళ్లు థర్డ్ పార్టీ అప్లికేషన్లను ఉపయోగించి చలాన్ మొత్తాన్ని ఎడిట్ చేస్తున్నారు. రూ. లక్ష రూపాయలు చెల్లించాల్సిన చోట కేవలం వందల్లోనో, వేలల్లోనో చెల్లించి, బయటికి మాత్రం పూర్తి మొత్తం కట్టినట్లుగా ఫేక్ చలాన్లు సృష్టిస్తున్నారు.

జనగామలో బయటపడ్డ బాగోతం

ఈ అక్రమ దందా జనగామ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఒకే రోజు రిజిస్ట్రేషన్ జరిగిన 10 చలాన్లకు సంబంధించి సుమారు రూ.8,55,577 ప్రభుత్వానికి జమ కాకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు లోతుగా విచారించగా, ఈ ఘోరం బయటపడింది. దీనిపై జనగామ తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఈ భారీ స్కామ్ కేవలం బయటి వ్యక్తులే చేయడం సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. భూపరిపాలన ప్రధాన కార్యాలయం (CCLA) లోని టెక్నికల్ విభాగం సిబ్బంది సహకారం లేకుండా డేటా మ్యానిపులేషన్ చేయడం అసాధ్యమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే యాదాద్రికి చెందిన ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు ఈ చలాన్లను ఎడిట్ చేసి పేమెంట్ చేసినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story