బస్సులో మంటలు.. వీడియోల కోసం ఎగబడకుండా.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన స్థానికులు

by Muthe.Rajitha |

కేరళలో జరిగిన ఓ బస్సు ప్రమాదంలో స్థానికుల తక్షణ సహాయం వలన 35 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

బస్సులో మంటలు.. వీడియోల కోసం ఎగబడకుండా.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన స్థానికులు
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళలోని ఒట్టప్పాలంలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రమాదం జరిగినపుడు వీడియోల కోసం ఎగబడకుండా స్థానికులు చూపించిన ధైర్యాన్ని అందరూ కొనియాడుతున్నారు. నిజంగా హృదయస్పర్శకమైనది. వారి తక్షణ ప్రతిస్పందన వల్ల అంత పెద్ద అగ్నిప్రమాదంలో బస్సులోని ప్రయాణికుల్లో ఒక్కరికి కూడా చిన్న గాయం కాకుండానే బయట పడ్డారు. అంతేకాదు బస్సు మంటలను కూడా పూర్తిగా ఆపివేసి, పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ కు మంటలు అంటుకోకుండా ఘోర ప్రమాదం నుంచి కాపాడారు.

స్థానికుల తెగువ, సమయస్ఫూర్తి

ఇటీవల కేరళ రోడ్డు రవాణాకు చెందిన బస్సు 35 మంది ప్రయాణికులతో వెళ్తుండగా.. ఒట్టుపాలం వద్దకు రాగానే, బస్సు ముందుభాగంలో ఇంజన్ దిగువ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే పొగ బస్సు లోపల నిండిపోయింది. ముందు ఆటోమేటిక్ డోర్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ కారణంగా జామ్ అయిపోవడంతో ప్రయాణికులు బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. అప్పుడు సమీపంలో బైక్‌పై వెళ్తున్న డెలివరీ ఎగ్జిక్యూటివ్ శ్రీరాగ్ పరిస్థితిని గమనించి వెంటనే స్పందించాడు. తన బైక్‌ను పక్కన పడేసి బస్సు వైపు పరుగెత్తి, జామ్ అయిన ముందు డోర్‌ను పగులగొట్టి తెరిచాడు. అతనితోపాటు చుట్టుపక్కల ఉన్న ఆటో డ్రైవర్లు, షాప్ యజమానులు కూడా తక్షణమే స్పందించి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు తీసుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వారంతా క్షణాల్లో స్పందించడంతో మొత్తం ఘటన కేవలం 45 నుంచి 60 సెకన్ల వ్యవధిలోనే సుమారు 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

'సెల్యూట్' కేరళ పీపుల్

ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో... ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు కూడా ఈ ఘటనను ప్రముఖంగా ప్రసారం చేశాయి. సామాజిక స్పృహలో, తక్షణ సహాయంలో కేరళ ప్రజలు ముందు ఉంటారని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ప్రమాదం జరిగినపుడు చూస్తూ నిలబడమో, భయపడటమో లేదా ఫోన్లో వీడియోలు తీసుకోకుండా స్థానికులు ధైర్యం, మానవత్వం, సమయస్ఫూర్తి గొప్పగా చూపించారని కొనియాడుతున్నారు. అంతేకాదు "కేరళ మోడల్" అంటూ హ్యాట్సాఫ్ చేస్తున్నారు.

Next Story