- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిగువ కోర్టు తీర్పుతో అంతా అయిపోలేదు.. అసలు న్యాయం ముందుంది: సీఎం రేఖా గుప్తా కీలక వ్యాఖ్యలు
కేజ్రీవాల్ నిర్దోషిత్వం ఒక డ్రామా; సాక్ష్యాలను తారుమారు చేశారు. నిజంగా నిజాయితీ ఉంటే లిక్కర్ పాలసీని ఎందుకు రద్దు చేశారు?" అని నిలదీసిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. దిగువ కోర్టు తీర్పుపై ఘాటు విమర్శలు.

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi liquor scam case)లో 23 మందికి రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దిగువ కోర్టు ఇచ్చి ఈ తీర్పుపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (Delhi CM Rekha Gupta) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రమేనని, పై కోర్టుల్లో న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను ఎలా తారుమారు చేశారో అందరికీ తెలుసని ఆరోపించిన ఆమె, "ఒకవేళ మీరు (కేజ్రీవాల్) నిజంగా నిర్దోషి అయితే, విచారణ మొదలవ్వగానే ఆ మద్యం విధానాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారు?" అని ప్రశ్నించారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు గతంలో కోర్టులు కూడా ఆందోళన వ్యక్తం చేశాయని ఆమె గుర్తు చేశారు.
అలాగే కేజ్రీవాల్ ఇప్పటికీ ప్రజల ముందు డ్రామాలు చేస్తున్నారని, ఆప్ ప్రభుత్వంలో ఢిల్లీలో ఆయన చేసిన అభివృద్ధి శూన్యమని రేఖా గుప్తా విమర్శించారు. కేజ్రీవాల్ హయాంలో ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోనూ ఏదో ఒక అవినీతి కుంభకోణం బయటపడుతూనే ఉందని మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు ఇప్పటికే ఆయనను ఎన్నికల్లో ఓడించి సరైన తీర్పు ఇచ్చారని, న్యాయస్థానం కూడా అంతిమంగా దోషులకు శిక్ష పడేలా న్యాయం చేస్తుందని తాను నమ్ముతున్నట్లు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీడియాతో చెప్పుకొచ్చారు. దాదాపు 900 రోజులుగా న్యాయ స్థానంలో విచారణ జరుగుతుండగా.. రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పుపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ లిక్కర్ స్కాం కేసులో మరోసారి న్యాయ పోరాటం మొదలైంది.






