గ్రామాల్లో.. గ్రంథాలయాలు..!

by Ratna Kumari |

ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెల్లో చదువుపై కొత్త చైతన్యం కనిపిస్తోంది.

గ్రామాల్లో.. గ్రంథాలయాలు..!
X

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెల్లో చదువుపై కొత్త చైతన్యం కనిపిస్తోంది. ఒకప్పుడు సాయంత్రం వేళ టీ దుకాణాలు, గ్రామ చౌరస్తాలు, మొబైల్ ఫోన్‌లతో కాలం గడిపే యువత ఇప్పుడు పుస్తకాల మధ్య భవిష్యత్తును నిర్మించుకునేందుకు ముందుకు వస్తోంది. జిల్లాలోని పలు గ్రామాల్లో యువకులు, గ్రామ పెద్దలు, ఉద్యోగులు, దాతలు కలిసి విరాళాలు సేకరించి గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను స్టడీ రూమ్‌లుగా మార్చి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మరోవైపు యువత చదువే లక్ష్యంగా పోలీస్ శాఖ కూడా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో ఆధునిక గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తూ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, చదువుకునే వాతావరణాన్ని కల్పిస్తోంది. దీంతో గ్రామాల్లో చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా యువత ముందుకు సాగుతోంది. ఉద్యోగం సాధించాలంటే చదువే మార్గమనే ఆలోచనతో యువత పుస్తకాల వైపు అడుగులు వేస్తుండగా, గ్రామస్తులు కూడా విరాళాలు, పుస్తకాలు, ఫర్నిచర్ అందిస్తూ సహకారం అందించడం జిల్లాలో స్ఫూర్తిదాయకంగా మారింది.

గ్రామాల్లో గ్రంథాలయాల సంస్కృతి..

ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తోంది. చదువుకునేందుకు సరైన వాతావరణం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఇప్పుడు గ్రామాల్లోనే స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసుకుని ఉపయోగించుకుంటున్నారు. కొందరు యువకులు కలిసి గ్రామంలోని ఖాళీ భవనాలను శుభ్రపరిచి చదువుకునే గదులుగా మార్చారు. విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేసి ప్రతిరోజూ గంటల తరబడి చదువుకుంటున్నారు. ముఖ్యంగా నగరాలకు వెళ్లే అవకాశం లేని పేద విద్యార్థులకు ఈ గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.జిల్లాలోని తాంసి మండలం కప్పర్ల, తలమడుగు మండలం ఖోడద్ గ్రామాల్లో ప్రజల విరాళాలతో ఏర్పాటు చేసిన లైబ్రరీలు ఇప్పటికే పలువురు యువతకు ఉద్యోగాల సాధనలో దోహదపడగా, వాటిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని గ్రామాల్లో కూడా గ్రంథాలయాల ఏర్పాటుకు గ్రామస్తులు ముందుకు వస్తున్నారు.

పోలీస్ శాఖ ప్రత్యేక లైబ్రరీలు..

గ్రామీణ, ఆదివాసీ ప్రాంత యువత ఉన్నత విద్యతో పాటు పోటీ పరీక్షల్లో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక గ్రంథాలయాల ఏర్పాటు కొనసాగుతోంది. ఇప్పటికే ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్, గాదిగూడ మండలం లోకారి గ్రామాల్లో ప్రత్యేక లైబ్రరీలను ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం యూపీఎస్సీ, గ్రూప్స్, ఎస్సై, కానిస్టేబుల్, డీఎస్సీ, టీజీటీ, ఆర్‌ఆర్‌బీ తదితర పరీక్షలకు ఉపయోగపడే 500కు పైగా పుస్తకాలను అందుబాటులో ఉంచారు. "భవిష్యత్తును మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువే" అనే సందేశంతో యువతను చదువు వైపు ప్రోత్సహిస్తున్నారు. త్వరలో పోలీసు నియామకాల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

పల్లెల్లో పుస్తకాల పరిమళం..

గ్రామాల్లో ఏర్పడుతున్న ఈ లైబ్రరీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మాజీ విద్యార్థులు, వ్యాపారులు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తూ చదువుకు అండగా నిలుస్తున్నారు. కొందరు పోటీ పరీక్షల పుస్తకాలు అందిస్తే, మరికొందరు నగదు, ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నారు. రోజువారీ పత్రికలు, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, ఉద్యోగ నోటిఫికేషన్ మెటీరియల్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ లైబ్రరీల ద్వారా ఉద్యోగాలు సాధించిన యువత తిరిగి తమ గ్రామాలకు సహాయం చేస్తూ పుస్తకాలు, ఫర్నిచర్ అందించడం విశేషం. దీంతో గ్రామాల్లో చదువుపై కొత్త చైతన్యం నెలకొనగా, పుస్తకాల సంస్కృతి మరింత విస్తరిస్తోంది.

గ్రామ లైబ్రరీతో ఉద్యోగం సాధించా ..

కడదారపు గంగాసాగర్, (SGT టీచర్)

మా గ్రామంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ ఎంతో మందికి ఉపయోగపడుతోంది. నేను కూడా ఈ లైబ్రరీలోనే ప్రతిరోజూ చదువుకొని SGT టీచర్ ఉద్యోగం సాధించాను. గ్రామంలో ప్రశాంత వాతావరణం,అందుబాటులో ఉన్న పుస్తకాలు, యువత పరస్పర సహకారం నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇప్పటివరకు ఈ లైబ్రరీ ద్వారా సుమారు 20 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉంది. గ్రామాల్లో ఇలాంటి లైబ్రరీలు పెరిగితే మరింత మంది యువత మంచి భవిష్యత్తు సాధించగలరు.

Next Story